విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఉరుటి నాగేశ్వరరావు, నమ్మి సతీష్, నమ్మి నాగ అప్పారావులను బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు కూలి పని నిమిత్తం మునగపాక మండలం యాదగిరి పాలెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో రావడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.