ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. వచ్చే 3 రోజులు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
సోమవారం(మార్చి 24న) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు, శ్రీకాకుళం జిల్లా-4, విజయనగరం-3, పార్వతీపురం మన్యం-7, అల్లూరి సీతారామరాజు-3, తూర్పుగోదావరి-3, ఏలూరు-3, ఎన్టీఆర్-1 మండలాల్లో(24) వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఆదివారం నంద్యాల జిల్లా పగిడ్యాలలో 39.9 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా అట్లూరులో 39.5 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 39.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచించారు.
ఇవాళ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా..
ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.