ఇండోర్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్ ధావన్(32;29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో ధావన్‌కు శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు. కాగా, జట్టు స్కోరు 86 పరుగుల వద్ద ధావన్ ఔట్ అయ్యాడు. అటు తర్వాత అయ్యర్-విరాట్ కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించారు.కాగా, భారత్ విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. కోహ్లి-రిషభ్ పంత్‌లు మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. కోహ్లి( 30 నాటౌట్; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్) సిక్స్ కొట్టడంతో 17.3 ఓవర్‌లోనే టీమిండియా విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. లంక ఆటగాళ్లలో కుశాల్ పెరీరా 34 పరుగులే అత్యధికం కావడం గమనార్హం.. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ లంకేయుల్ని కట్టడి చేశారు. బుమ్రా, షైనీ, శార్దూల్ ఠాకూర్‌లు తమ పేస్‌తో ముప్పు తిప్పలు పెట్టగా, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు తమ మ్యాజిక్‌ను ప్రదర్శించారు. దాంతో లంకేయులు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా, సైనీ, కుల్దీప్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది.