మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. మొత్తం 46 రోజుల పాటు జరగనున్న ఈ వన్డే వరల్డ్‌కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. కొంతమంది ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కానుంది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం…
🔴మహేంద్ర సింగ్ ధోని :
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇది నాలుగో వన్డే వరల్డ్‌కప్. ఐసీసీ నిర్వహించే వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లను నెగ్గిన ఏకైక కెప్టెన్ ధోనియే. అంతేకాదు మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను కూడా నెగ్గాడు. భారత్ తరుపున ధోని ఇప్పటివరకు 332 వన్డేలాడి 50.11 యావరేజితో 10173 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యత్తుమ ఫినిషర్‌గా పేరుగాంచిన ధోనికి ఇదే ఆఖరి వరల్డ్‌కప్ కానుంది. ఈ వరల్డ్‌కప్‌లో భారత విజయాల్లో ధోని కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.
✅వన్డే మ్యాచ్‌లు: 332
✅పరుగులు : 10173
✅సెంచరీలు : 10
✅అర్ధసెంచరీలు: 67
🔴రాస్ టేలర్ :
న్యూజిలాండ్‌కు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌కు బహుశా ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావొచ్చు. 2006లో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన రాస్ టేలర్ ఇప్పటి వరకు మూడు వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్నాడు. అయితే, 2016లో కంటి శస్త్ర చికిత్స తర్వాత అతడి టెక్నిక్‌లో మార్పులు చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
✅వన్డే మ్యాచ్‌లు : 218
✅పరుగులు : 8026
✅సెంచరీలు : 20
✅అర్ధసెంచరీలు: 47
🔴లసిత్ మలింగ :
ఇటీవలే ముగిసిన ఐపీఎల్-12 సీజన్‌లో సత్తా చాటాడు. ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరేట్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో మలింగ సత్తా చాటతాడు. 2007 ప్రపంచకప్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అబ్బురపరిచాడు. ఇటీవలి కాలంలో గాయాలు కావడం, ఫామ్ కోల్పోవడంతో మలింగ ఫామ్‌ను కోల్పోయాడు. మరి, ఈ వరల్డ్‌కప్‌లో ఎలాంటి ప్రభావం చూపిస్తాడో…
✅వన్డే మ్యాచ్‌లు : 218
✅వికెట్లు : 322
✅ఎకానమీ : 5.33
✅ఉత్తమం : 6/38
🔴క్రిస్ గేల్ :
2015లో జరిగిన వరల్డ్‌కప్‌లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో కూడా కచ్చితంగా రాణించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. వెస్టిండిస్ గనుక ఈసారీ కప్ గెలవకపోతే ఐదు ప్రపంచకప్‌లు ఆడినా కప్ గెలవలేకపోయిన లారా, చందర్‌పాల్, మహిళా జయవర్దనే, జాక్వస్ కలిస్, డానియేల్ వెటోరి, షాహిద్ అఫ్రిది సరసన చేరతాడు.
✅వన్డే మ్యాచ్‌లు : 289
✅పరుగులు : 10151
✅సెంచరీలు : 25
✅అర్ధసెంచరీలు: 51
🔴హషీమ్ ఆమ్లా :
హషీమ్ ఆమ్లా… సఫారీ జట్టు తరుపున అత్యధిక సెంచరీలు(27) చేసిన ఆటగాడు. 2018 నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒకానొక సందర్భంలో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. బహుశా ఆమ్లాకి కూడా ఇదే చివరి వరల్డ్ కప్ కావొచ్చు. 2011, 2015 ప్రపంచకప్‌లలో ఆడినా జట్టును ఫైనల్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు.
✅వన్డే మ్యాచ్‌లు : 174
✅పరుగులు : 7910
✅సెంచరీలు : 27
✅అర్ధసెంచరీలు: 37