రాష్ట్రంలో అందరిచూపు రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాపైనే ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయం పందేలకు వేదికగా మారింది. ఇక్కడ జరిగే పందేల తీరు కూడా అలాగే ఉంటుంది. బెట్టింగ్ మాట వినిపిస్తే చాలు పందెంరాయుళ్లకు కృష్ణా జిల్లానే గుర్తొస్తుంది. పార్లమెంట్, శాసనసభ స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములపై రూ. కోట్లలో పందేలు జరుగుతున్నాయి.
రూ. 10వేల నుంచి మొదలై..
నలుగురైదుగురు కలిపి పెద్ద మొత్తాల్లో పందేలు కాస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదేస్థాయిలో కొందరు యువకులు చిన్నపాటి పందేలకు దిగుతున్నారు. పోలింగ్ ముందు వరకు ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని..రాష్ట్రంలో పార్టీలకు లభించే స్థానాలు, జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై ఇవి సాగాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటాపోటీ ఉన్నా.. పోలింగ్ తర్వాత చిత్రం మారిపోయింది. ఎన్నికలు ఏకపక్షంగా సాగాయన్న అంచనాకు రావడం.. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని చెప్పడంతో అప్పటి వరకు అధికారపార్టీ గెలుస్తుందని పందేలు కాసిన పందేంరాయుళ్లు ప్రస్తుతం ఆచితూచి పందేలు కాస్తున్నారు.
ఒకటికి పదిసార్లు ఫలితం ఎటువైపు ఉంటుందోనని అన్ని కోణాల్లో ఆలోచించి మరీ ముందుకెళ్తున్నారు. కేవలం మెజార్టీపైనే పందేలు పెద్త ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల తర్వాత జిల్లాలోని పందెంరాయుళ్లతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వంటి మెట్రో నగరాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బడాబాబులు పెందేలు కాసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఇదిగో ఇలా పందేలు..
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారం చేజిక్కుంచుకుంటుందని కొందరు.. టీడీపీ తిరిగి అధికారం చేపడుతుందని మరికొందరు పందేలు కాస్తున్నారు. ఫలానా పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని.. మరోపార్టీకి వందసీట్లు దాటుతాయని.. ఇంకో పార్టీకి 5 దాటవని.. మరోపార్టీకి 30 లోపు వస్తాయని ఇలా పందేలు ఊపందుకున్నాయి. జిల్లా విషయానికొస్తే మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు స్థానాలపై పందేలు నడుస్తున్నాయి. ప్రధానంగా శాసనసభ నియోజకవర్గాల విషయానికొస్తే కీలకమైన మైలవరం, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, పెనమలూరు స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపైనా పందేలు కాస్తున్నారు.
పందేలకు ప్రత్యేక కేంద్రాలు..
రాజధాని ప్రాంతంలో పందెం రాయుళ్ల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, జగ్గయ్యపేట, మైలవరం, గుడివాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో వీరికి షెల్టర్లు వెలిశాయి. ఇవి ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర నగరాల పందెం రాయుళ్లకు కేంద్రాలుగా పనిచేస్తాయి. పందెంరాయుళ్లకు మధ్యవర్తిగా ఉంటూ ఇరుపక్షాల వద్ద సొమ్ము కట్టించుకుని గెలిచిన తర్వాత 10 శాతం కమీషన్ సొమ్మును మినహాయించి మిగిలిన సొమ్మును విజేతలకు అందజేస్తారని తెలుస్తోంది.