*ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు చేతికి* *మిగిలేవి గరిష్ఠంగా నాలుగే* *ఉపాధి హామీకి మరో రూ.40,000 కోట్లు* *రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు* *తుది విడత ప్యాకేజిని ప్రకటించిన నిర్మలా సీతారామన్* *మొత్తం విలువ రూ.21 లక్షల కోట్లు* కరోనా ప్రభావం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరిన్ని కీలక నిర్ణయాలు వెలువరించింది. చిన్న పరిశ్రమలకు చేయి అందిస్తూనే.. వ్యూహాత్మకం కాని రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. గుర్తించిన వ్యూహాత్మక రంగాల్లోనూ పీఎస్‌యూలను గరిష్ఠంగా నాలుగుకు పరిమితం చేయనుంది. మిగిలినవాటిని విలీనమో, విక్రయించడమో చేసేలా కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ప్యాకేజిలో భాగంగా ఐదోది, చివరి విడత నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులకు వెల్లడించారు. నూతన పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎస్‌ఈ) విధానాన్ని ఆమె ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల రీత్యా కొనసాగించాల్సి ఉన్న పీఎస్‌యూల జాబితాను రూపొందిస్తామని చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లో కనీసం ఒకటి ప్రభుత్వ రంగంలో మిగులుతుందని, దానిలోనూ ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరిపాలన పరమైన అనవసర ఖర్చుల్ని సాధ్యమైనంత తగ్గించుకునేందుకు పరిమిత సంఖ్యలోనే పీఎస్‌యూలను కొనసాగిస్తామని వివరించారు. ఆర్‌బీఐ ప్రకటించిన రూ.8 లక్షల కోట్ల ద్రవ్యలభ్యత చర్యలతో కలిపి మొత్తం ప్యాకేజి రూ.20.97 లక్షల కోట్లకు పెరిగింది. అయితే- ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాల్సి వచ్చే నగదును మాత్రం 10% కంటే తక్కువకు పరిమితం చేసేలా తాజా నిర్ణయాలు ఉన్నాయి. కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చే కొన్ని చర్యల్నీ దీనిలో చేర్చారు. సొంత రాష్ట్రాల బాట పట్టిన వలస కార్మికులకు పనులు చూపించడానికి వీలుగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను రూ.40,000 కోట్లు పెంచారు. బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.61,000 కోట్లకు ఇది అదనం. పెంచిన కేటాయింపుల వల్ల 300 కోట్ల పనిదినాలు సృష్టించడానికి వీలవుతుంది. పేదలకు ఉచిత వంటగ్యాస్, ఆహార ధాన్యాలు, కొన్ని వర్గాల వారికి మూడు నెలల పాటు నగదు అందజేత సహా ప్రస్తుత చర్యల వల్ల ప్రభుత్వం ఎంత మొత్తాన్ని అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందో చెప్పడానికి మంత్రి నిరాకరించారు. ఇది రూ.2.01 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా ప్రభావం నుంచి బయట పడడానికి ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ను రూ.20 లక్షల కోట్లతో అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది 2019-20 జీడీపీలో సుమారు 10% ఉంటుందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికే రుణపరిమితి వెసులుబాటు రుణ పరిమితిని రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3% నుంచి 5 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వినతికి కేంద్రం అంగీకరించిందని ఆర్థిక మంత్రి చెప్పారు. అయితే ఇది 2020-21 ఆర్థిక సంవత్సరానికేనన్నారు. ఈ నిర్ణయం వల్ల రూ.4.28 లక్షల కోట్ల మేర అదనపు వనరులు రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మొదటి 0.5% పెంపుదలకు ఎలాంటి షరతులూ ఉండవు. ఆ పైబడిన రుణాలకు మాత్రం కొన్ని రంగాల్లో సంస్కరణల అమలుతో ముడిపెట్టారు. ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు, సరళతర వ్యాపార నిర్వహణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయం, విద్యుత్తు పంపిణీలో సంస్కరణలు వంటి నిర్దిష్ట సంస్కరణలతో పరిమితి ఆధారపడి ఉంటుంది. అప్పులు చేసి తెచ్చే డబ్బు వల్ల పేదలు లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే సంస్కరణలతో దీనిని ముడిపెట్టినట్లు నిర్మల చెప్పారు. బడ్జెట్ అంచనాల కంటే వాస్తవ ఆదాయం అనూహ్యంగా పడిపోయినా ఏప్రిల్‌లో రాష్ట్రాలకు రూ.46,038 కోట్లను కేంద్రం ఇచ్చిందని చెప్పారు. రెవెన్యూ లోటు పరమైన గ్రాంట్ల కింద రూ.12,390 కోట్లను ఏప్రిల్, మే నెలల్లో సకాలంలో ఇచ్చామన్నారు. *ఆన్‌లైన్‌లో విద్య* ‘పీఎం ఈ విద్య’ కార్యక్రమం కింద డిజిటల్/ ఆన్‌లైన్ విద్యను వెంటనే ప్రారంభిస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఈ నెల 30 నాటికి 100 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు వీటిని ఆటోమేటిగ్గా ప్రారంభించేందుకు అనుమతిని ఇస్తున్నట్లు చెప్పారు. *స్పందనలు… నిపుణుల వ్యాఖ్యలు* *గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నూతనోత్తేజం* కేంద్ర ప్యాకేజీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొత్త శక్తిని సంతరించుకుంటుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తల్ని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు సాయం అందిస్తుంది. దేశ విద్య, ఆరోగ్య రంగాలను రూపాంతరీకరించేలా ప్రభావాన్ని చూపిస్తుంది. రాష్ట్రాల్లో సంస్కరణలకు ఊతమిస్తుంది.- *ప్రధానమంత్రి నరేంద్రమోదీ* *చర్చకు ముందుకు రాగలరా?* ప్రభుత్వం ప్యాకేజీ విలువను రూ.20 లక్షల కోట్లుగా చెబుతున్నా వాస్తవంగా అది రూ.3.22 లక్షల కోట్లే. జీడీపీలోనైతే 1.6 శాతమే. తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతోంది. ఆర్థిక రంగానికి ఉద్దీపన ఇవ్వడానికి, రుణాల మంజూరుకు మధ్య తేడా ఉంది. ప్యాకేజీపై చర్చకు ఆర్థిక మంత్రి ముందుకు రాగలరా? – *కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ* *6 శాతానికి విత్తలోటు* కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో బడ్జెట్‌పై వాస్తవంగా ఆర్థికంగా ప్రభావం రూ. 1.5 లక్షల కోట్లు (జీడీపీలో 0.75%) ఉంటుందని అంచనా. ఉద్దీపన ప్యాకేజీలోని అంశాల అమలు తర్వాత 20-21 ఆర్థిక సంవత్సరంలో విత్తలోటు 3.5% నుంచి 6 శాతానికి పెరుగుతుంది. – *బార్క్లే భారతదేశ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్ బజోరియా* *ప్యాకేజీలో 10 శాతమే అదనపు ఖర్చు* రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీలో 5% ఇప్పటికే బడ్జెట్ ఖర్చుల్లో ఉంది. మొత్తం ప్యాకేజీలో 10 శాతమే నేరుగా అదనపు బడ్జెట్ వ్యయంగా ఉంటుంది. మిగిలినదంతా ఆర్‌బీఐ ప్రకటించిన ద్రవ్య విధానానికి సంబంధించినదే. పెరిగిన రుణ పరిమితిని చాలా రాష్ట్రాలు వాడుకోకపోవచ్చు. – *ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డి.కె.శ్రీవాస్తవ* *ప్యాకేజిల వారీగా ఆర్థిక ఉద్దీపన ఇలా…* *ఏ విడత? మొత్తo (రూ.కోట్లలో)* 1) 5,94,550 2) 3,10,000 3) 1,50,000 4) & 5) 48,100 *ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజి* : 1,92,80 *ఆర్‌బీఐ* : 8,01,603 *అన్నింటి మొత్తం* : 20,97,053
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.