💥ఖర్మకాలిన జీవితాలు…
👉అవును, ఎవడి ఖర్మ ఎప్పుడు కాలిపోతుందో అర్థంకాని జీవితమైపోయింది అందరిదీ..
👉హమ్మయ్య, ఇవాల్టికి నాకు కరోనా రాలేదు.. గండం గడిచిపోయిందనుకుని సంబరపడిపోయి బతికేసే రోజులు వచ్చేశాయి..
👉ఏదీ ఇంతకుముందులా జీవితం లేదు.. ఇక ముందూ ఉండకపోవచ్చు.. అంతా విచిత్రం. అంతా విడ్డూరం..
అంతా భయం .. భయం .. భయం.
👉పక్కింటోళ్లతో మాట్లాడుకోవడం మానేశాం.. పక్కింటి పిల్లల్ని మన ఇంటికి రానివ్వడం ఏనాడో మర్చిపోయాం..ఎక్కడ కరోనా వస్తుందోనని..మన పిల్లల్ని నాలుగు గోడల మధ్య కట్టేస్తున్నాం.. కరోనా పుట్టుపూర్వోత్తరాల గురించి మాటలు రాని పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పేస్తున్నాం. ఆఖరికి పక్కింటోళ్లు పెట్టిన దేవుడి ప్రసాదం కూడా తినడం మానేశాం.ఎక్కడ ఆ కరోనా పురుగు అందులో ఉందోనని..
👉ఏదో తెలీని అంటరాని తనం తెలియకుండానే మనం అలవాటు చేసేసుకున్నాము..
👉ఇంట్లో కూడా చాలా మంది మాస్క్ లు కట్టుకుని బతికేస్తున్నారు.
కూరగాయలపైనా శానిటైజర్ కొట్టి ఎండలో ఎండబెట్టి వండుకుంటున్నారు..
రోజుకు వందసార్లు చేతులు కడిగేస్తున్నారు.
మాస్క్ కట్టీ కట్టీ మూతి తెల్లగా అయిపోయింది..
చేతులకు శానిటైజర్ రాసీ రాసీ.. పొట్టు ఊడిపోతోంది.. _కషాయాలు తాగీ తాగీ నోరంతా అదోమాదిరిగా తయారైంది..
👉పండగలు, పబ్బాలు నాలుగు నెలల క్రితమే మానేశాం..
నలుగురు కలిసి సంతోషంగా నవ్వుకుని నాలుగు నెలలు దాటిపోయింది.
👉మందు కొట్టేటప్పుడు తాగుబోతులు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేస్తున్నారు.
కబుర్లు చెప్పుకుంటూ చాయ్ దుకాణం దగ్గర చాయ్ తాగుతూ.. సిగరెట్ పీకే ఆలోచనలు కల్లోకి కూడా ఎవరికీ రావడం లేదు.
పాలప్యాకెట్ వేసేవాడు కూడా ఇంటి కింద గేటు దగ్గరే వేసి వెళ్లిపోవాలి..
ఏ ఆమెజానోడో.. ఫ్లిప్ కార్టోడో ఖర్మకాలి ఇంటి గుమ్మం దాకా వచ్చాడో చచ్చాడే.. గుమ్మానికి ఆవతలెక్కడో ప్యాకెట్ విసిరి పారేస్తే తెచ్చుకుని దాన్ని శానిటైజర్ లో ముంచి లేపి గానీ ఓపెన్ చేయడం లేదు.. ఎక్కడ మహమ్మారిని అందులో ఏమూలో వేసుకొచ్చాడోమోనని..
_స్విగ్గీలు, జొమాటోల్లో ఆర్డర్లు మానేశాం.. ఒకవేళ ఆర్డరిచ్చినా ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ నే ఆర్డరిస్తున్నాం.అంతేగాదు ఆర్డరిచ్చేముందే డెలివరీ బాయ్ కి నో కాంటాక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం..
👉పార్క్ ల్లో ప్రేమ జంటల కిలకిలలు, ముద్దూ ముచ్చటలూ మాయమైపోయాయి..
స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్మింగ్ మానేసాం..
అందమైన జలపాతాలు, పర్యాటక ప్రాంతాల్లో ఫ్యామిలీతో కలిసి వెళ్లడం అనేది.. ఊహల్లో మాత్రమే..
సినిమా దియేటర్ లో పాప్ కార్న్ తింటూ సినిమా చూసే రోజులు పోయాయి.. ఇకపై ఉండకపోవొచ్చు..
ఆఫీసులన్నీ బోసిపోయాయి… షాపులన్నింటికీ తాళాలు పడిపోయాయి..
కర్మాగారాలన్నీ మూతబడిపోయాయి..
వ్యాపారాలన్నీ నాశనమై పోయాయి..ఉద్యోగాలన్నీ ఎగిరిపోయాయి.. జీవితం సంకనాకిపోయింది…
👉అంతా భయం.. భయం.. భయం..
బయటికెళ్తే కరోనా..
టీ తాగితే కరోనా..
సమోసా తింటే కరోనా..
పానీ పూరి తింటే కరోనా..
కూరగాయల్లో కరోనా..
పాలల్లో కరోనా..
షాపుకెళ్తే కరోనా…
పార్క్ కెళ్తే కరోనా..
వాకింగ్ కెళ్తే కరోనా..
గుడికి వెళ్తే కరోనా… చర్చికి వెళ్తే కరోనా..పెళ్లి కి వెళ్తే కరోనా… ఫంక్షన్ కి వెళ్తే కరోనా.. ఎక్కడికి వెళ్లినా కరోనానే..
👉ఏం చేస్తున్నాం..ఎవడు ఏం చెప్పినా వెంటనే పాటించేస్తున్నాం..
ఎవరో ఏదో తింటే కరోనా రాదంటే అది కసకసా నమిలి మింగేస్తున్నాం..
ఎవరో ఏదో తాగితే కరోనా రాదంటే పిచ్చి కషాయాలన్నీ తాగేస్తున్నాం..
👉కరోనాతో చచ్చింది కన్నతండ్రైనా.. తోడబుట్టిన సోదరి అయినా కడుపున బుట్టిన పిల్లలైనా ఎవరి దగ్గరకూ వెళ్లలేకపోతున్నాం.. మూటగట్టి నిర్ధాక్షిణ్యంగా శవాన్ని బుల్డోజర్ తో మున్సిపాల్టీ వాళ్లు గోతిలోకి విసిరిపారేస్తే టీవీల్లో చూసి కన్నీళ్లు పెట్టేసుకుంటున్నాం..
👉పక్కింటోడికి చిన్న జ్వరం వచ్చినా కరోనా వచ్చిందేమోనని ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్లిపోతున్నాం… రోడ్డుమీద ఎవరైనా తుమ్మితే, దగ్గితే వణికిపోతున్నాం.. అంతా భయం .. భయం.. భయం.. చస్తా మేమోనని భయం..
చావొస్తుందేమోనని భయం.. బతకాలి..మనం మాత్రమే బతకాలి..
ఏ కరోనాలు సోకకుండా మనం, మన పిల్లలు మాత్రం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి.. అంతే..అదే కావాలి.
👉రేపటి సంగతి ఏంటో తెలీదు..
వ్యాక్సిన్లు వస్తాయో రావో తెలీదు..
రేపటి తరం పరిస్థితి ఏంటో తెలీదు..
బతకడమెలాగో అర్థం కావడం లేదు.
👉డబ్బులు లేనోళ్లకి చాలా మందికి పూట గడవడం లేదు.. డబ్బులెక్కువైనోళ్లకి సమయం గడవడం లేదు..
ఇంకొన్నాళ్లకి చాలామంది మానసిక వ్యాధి గ్రస్థుల్లా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
_భయంతో ఇప్పటికే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వ్యాపారాలు దెబ్బతిని అల్లాడిపోతున్నారు.
👉ఇలాంటి విపత్కర సమయంలోనూ ఒకరికి ఒకరు సాయం చేసుకునే మంచితనం, మానవత్వం కనీసం మన దరిదాపుల్లోకి కూడా రావడం లేదు.
👉పక్కోడు తిండికి లేక అల్లాడుతున్నా.. ఉద్యోగం లేక బాధపడుతున్నా కనీసం స్పందించే హృదయం లేదు.. డబ్బంతా ఇళ్లల్లో, బ్యాంకుల్లో దాచుకుంటాం.
👉అంతే అంతా కరోనా జీవితాలు..
👉అన్నీ ఖర్మగాలిన జీవితాలు..