మన రఫేల్‌ మరింత శక్తిమంతం

0

*మన రఫేల్‌ మరింత శక్తిమంతం* *అధునాతన హ్యామర్‌ క్షిపణులను అమర్చాలని భారత్‌ నిర్ణయం*

*ఫ్రాన్స్‌ నుంచి అత్యవసరంగా కొనుగోలు చేస్తున్న వాయుసేన*

దిల్లీ: కొత్తగా ఐదు రఫేల్‌ యుద్ధవిమానాలు తన అమ్ములపొదిలో చేరుతున్న నేపథ్యంలో వాటి పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. గాల్లో నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం క్షిపణి వ్యవస్థను దీనికి అమర్చాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

రఫేల్‌ యుద్ధవిమానంలో మీటియోర్‌, స్కాల్ప్‌ క్షిపణులు, మైకా ఆయుధ వ్యవస్థ ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. అయితే మధ్య శ్రేణి కలిగిన హ్యామర్‌ క్షిపణి వ్యవస్థను కూడా ఈ పోరాట విమానానికి అమర్చాలని మన వాయుసేన నిర్ణయించింది.

గాల్లో నుంచి భూతలంపైనున్న లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రానికి 60 కిలోమీటర్ల పరిధి ఉంది. ఫ్రాన్స్‌ ఆయుధ దిగ్గజం ‘శాఫ్రాన్‌’ వీటిని అభివృద్ధి చేసింది. నిజానికి వీటిని ఫ్రాన్స్‌ వైమానిక దళం, నౌకా దళం కోసం వీటిని రూపొందించారు.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆయుధ వ్యవస్థను సమకూర్చుకోవాలని భారత వాయుసేన నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించుకుంటోంది.

చైనాతో ఘర్షణల నేపథ్యంలో అత్యవసరంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనిక దళాలు సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ అధికారాలను ఇచ్చింది.

ఒక్కో ప్రతిపాదన కింద రూ.300 కోట్ల విలువైన సామగ్రిని సమకూర్చుకోవచ్చని సూచించింది.

Leave a Reply