*ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్‌ఫోనే లేదు*
*ఇంటర్నెట్ సౌకర్యమూ సున్నా* *అలాంటివారికి ఆన్‌లైన్‌లో చదువులు కష్టమే*
*తాజా సర్వేలో వెల్లడి*
దిల్లీ: దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యను అభ్యసించడానికి కావాల్సిన వ్యక్తిగత స్మార్ట్ ఫోన్లు లేవు. ఇంటర్నెట్ సౌకర్యమూ అందుబాటులో లేదు. తాజాగా బాలల హక్కుల సంఘం ‘క్రై’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
మే-జూన్ నెలల్లో 11-18 సంవత్సరాల మధ్య ఉండే 5,987 విద్యార్థులతో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు.
కొవిడ్ కారణంగా పాఠశాలల మూతపడిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆన్‌లైన్ విద్య ఎంత మందికి అందుబాటులో ఉందో.. వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వేలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక పరిస్థితే గుడ్డిలో మెల్ల. ఆ రాష్ట్రం నుంచి స్పందించిన 1145 మంది విద్యార్థుల్లో 9 శాతం మందికి వ్యక్తిగత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. తమిళనాడులో అత్యల్పంగా 3 శాతం మందికే ఈ ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఆందోళన కలిగించే విషయమేంటంటే సర్వే చేసిన విద్యార్థుల కుటుంబాల్లో 95 శాతం మంది వార్షిక ఆదాయం లక్ష కంటే తక్కువే.
ఆ ఆదాయంతో వారు స్మార్ట్‌ఫోన్ కొనడం.. పిల్లలను ఆన్‌లైన్ చదివించడం కష్టమేనని సర్వే అభిప్రాయపడింది.