*30% పాఠ్యాంశాల తగ్గింపు*
*ఆన్‌లైన్‌లో బోధన*
*సప్తగిరి ఛానల్, మన టీవీ ద్వారా ప్రసారం*
*ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు ఏపీ విద్యా సంవత్సరం*
*180 రోజుల పని దినాలు*
*కేలండర్ రూపకల్పనలో ఏపీ పాఠశాల విద్యాశాఖ*
*ఆన్‌లైన్‌లోనే యూజీ మొదటి సెమిస్టర్*
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆన్‌లైన్ తరగతులతోనే ప్రారంభం కానుంది. సాధారణ పరిస్థితి వచ్చేవరకు కొంతకాలం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాక నేరుగా బోధన చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకడమిక్ కేలండర్‌ను రూపొందిస్తోంది.
ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యా సంవత్సరం ఉండేలా కసరత్తు చేస్తున్నారు. పాఠ్యాంశాలను 30శాతం తగ్గిస్తారు. దీంతో పని దినాలు తగ్గినా విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. పండగ సెలవులతోపాటు పాఠ్యాంశాలను తగ్గించనున్నారు.
పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పులు చేయనున్నారు.
*ఉన్నత విద్యలో సెమిస్టర్..* అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ)లో మొదటి సెమిస్టర్ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా అభ్యాసన నిర్వహణ విధానం(ఎల్‌ఎంఎస్) తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉపాధ్యాయులు బోధించిన వీడియో పాఠాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
*ఏపీ విద్యా సంవత్సరం ఇలా..* * సంక్రాంతి, దసరా సెలవులను తగ్గిస్తారు. మొత్తం పని దినాలు 180.
* పాఠశాలలు పని చేసే 180 రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఆన్‌లైన్, దూరదర్శన్, మనటీవీ ద్వారా పాఠాల ప్రసారం. కరోనా ప్రభావం తగ్గాక నేరుగా తరగతులు.
* ఇప్పటికే ఆరు గంటలపాటు సప్తగిరి ఛానల్ ద్వారా 1-5 తరగతులకు బ్రిడ్జి కోర్సు, 6-10 విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. దీన్ని కొనసాగిస్తారు. దీనికి అదనంగా మన టీవీ ద్వారానూ పాఠాలను ప్రసారం చేయాలని భావిస్తున్నారు.
* మార్చిలో నిర్వహించే పరీక్షలను ఏప్రిల్‌కు మార్పు చేయడం, మే నెల మొదటి వారంలో 6-9 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా కేలండర్‌కు రూపకల్పన చేస్తున్నారు.
* మే రెండోవారం నుంచి 12 జూన్-2021 వరకు సెలవులు ఇచ్చి, తర్వాత ఎలాంటి మార్పుల్లేకుండా వచ్చే విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తారు.