*రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్*
*అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ఏపీ ప్రభుత్వం* *సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ*
Teluguwonders అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ చేశారు.
ఈ మేరకు రాజపత్రం (గెజిట్) విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. *హైకోర్టు ఆదేశాలతో..*
కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) రమేశ్‌కుమార్ మార్చి 15న నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై సీఎం జగన్‌తో పాటు అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్సు తెచ్చారు.
లాక్‌డౌన్ సమయంలోనే కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమించారు. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేసి తనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని రమేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌నే కొనసాగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనను ఎన్నికల కమిషనర్‌గా నియమించకపోవడంపై రమేశ్‌కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. కమిషనర్‌ను నియమించేది గవర్నర్ అని.. ఆయన్ను సంప్రదించాలని హైకోర్టు సూచించడంతో ఆయన గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు కోర్టు ధిక్కార పిటిషన్ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. నిలుపుదల ఉత్తర్వులు రాలేదు. గవర్నర్ చెప్పినా ఆయనను పదవిలో కొనసాగించకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం రమేశ్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమిస్తూ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
*అంతకు ముందు గురువారం ఉదయం..* హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్లికేషన్‌కు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టుల ఆదేశాలను అమలు చేయకుండా రాష్ట్రప్రభుత్వం చేస్తున్న చర్యలు ధిక్కరణకు నిదర్శనంగా ఉన్నాయని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ అప్లికేషన్‌ను పరిగణనలోకి తీసుకోవద్దంటూ పలు కారణాలు ప్రస్తావించారు.