సెంటిమెంట్! రాజకీయాల్లో ఈ మాటకు చాలానే వాల్యూ ఉంది. నాయకుల నుంచి పార్టీ వరకు కూడా సెంటిమెంట్‌నే ఫాలో అవుతూ ఉంటారు. అడుగుతీసి అడుగు వేసేందుకు సెంటిమెంట్ పాళ్లు కలిసి వస్తాయో లేదోనని ఒకటికి పది మార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్తారు. నాయకులు, నియోజకవర్గాలకు కూడా ఈ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాయకులైతే.. తాము గెలుపొందుతున్న నియో జకవర్గంపై మరింత సెంటిమెంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం ఒకటి పశ్చిమ గోదావరిలో వెలుగు చూసింది.
స్టేట్ వైడ్ గా హైలెట్.
పశ్చిమలోని ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థి తాలూకు పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఈ సెంటిమెంట్ తాలూకు ప్రధాన సారాంశం.
గతంలో ఇలానే జరిగింది.. ఇప్పుడు కూడా ఇలానే జరగుతుందని ఇక్కడి నాయకులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు ఏపీలో చాలానే ఉన్నాయి. పశ్చిమ తీర్పు అంటే రాష్ట్రానికే ఓ నమ్మకం ఉంటుంది. దీంతో ఇప్పుడు ఉంగుటూరు సెంటిమెంట్ స్టేట్‌వైడ్‌గా హైలెట్ అవుతోంది. ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెలువడుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఉంగుటూరు మీదే ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు. స్టేట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న ఆసక్తి కేవలం నియోజకవర్గంలోనే కాకుండా. జిల్లాలో కూడా చర్చకు వస్తోంది.
అన్ని ఎన్నికల్లోనూ.
1994 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే సెంటిమెంట్ ఇక్క కొనసాగుతూ వస్తోంది. 1994, 1999 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన కొండ్రెడ్డి విశ్వనాథం విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నిరాఘాటంగా రెండు సార్లు సీఎం అయ్యారు. ఇక, 2004, 2009 ఎన్నికల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్ ఇక్కడ పనిచేసింది. ఈ రెండు ఎన్నికల్లోనూ వట్టి వసంత కుమార్ ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. ఈ రెండు సార్లు ఆయనే ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఇక, ఆ రెండు సార్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ సీఎం అయింది కూడా ఈ కాలంలోనే. ఇక, 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి గన్ని వీరాంజనేయులు విజయం సాధించారు. టీడీపీ టికెట్ పై పోటీ చేసిన గన్ని 8 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఇక, 2014లో మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది.
ఆవిర్భావం నుంచీ.
ఈ సెంటిమెంట్ కేవలం 1983 నుంచి మాత్రమే కాదు. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతుందని, ఇక్కడ నుంచి గెలిచే పార్టీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు నియోజకవర్గం ప్రజలు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫు గన్ని మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైసీపీ తరఫున పుప్పాల శ్రీనివాసరావు, ఉరఫ్ వాసు బాబు పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ ఈ ఇద్దరే పోటీ పడ్డారు. దీంతో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.