డ్రాగన్‌తో ఢీ అంటే ఢీ

*డ్రాగన్‌తో ఢీ అంటే ఢీ*

సరిహద్దుల్లో టి-72, టి-90 ట్యాంకులను మోహరించిన భారత్‌

*వ్యయ ప్రయాసలకోర్చి పర్వత ప్రాంతాలకు తరలింపు

*తూర్పు లద్దాఖ్‌లో గర్జనకు సిద్ధం

భారీ యుద్ధ ట్యాంకులు..

మైదాన ప్రాంత పోరాటాల్లో రారాజులు. అయితే శీతల, పర్వతమయ ప్రాంతాల్లో వాటికి స్థానం లేదు. భారంగా.. గంటకు 50 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో కదిలే ఈ శకటాలు ప్రతికూల వాతావరణంలో మెరుగ్గా పోరాడలేవు. పైగా వాటిని అక్కడికి తరలించడమూ కష్టమే. అందుకే అలాంటి ప్రాంతాల్లోకి వాటిని పంపే ఆలోచనను సైన్యాలు చేయవు. భారత సైన్యం దీన్ని మార్చేసింది. సరిహద్దుల్లో చైనాకు ముకుతాడు వేయాలన్న దృఢ నిశ్చయంతో ప్రధాన యుద్ధ ట్యాంకులైన టి-72, టి-90లను కొన్నేళ్ల కిందటే తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. ఇప్పుడు అవి డ్రాగన్‌పై గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. *2014 నుంచే..* తూర్పు లద్దాఖ్‌లో ఎత్తయిన పర్వతాలు, లోయలే అధికం. అయితే చుషుల్‌, దెమ్‌చోక్‌ వంటి చోట్ల పీఠభూములు లాంటివీ ఉన్నాయి. ఆ ప్రాంతాలు ట్యాంకు యుద్ధానికి అనువైనవని భారత్‌ కొన్నేళ్ల కిందటే గుర్తించింది. అయితే ఈ శకటాలు ప్రధానంగా మైదాన ప్రాంతాల్లో, సాధారణ ఉష్ణోగ్రతల్లో పని చేయడానికి రూపొందినవే. ఈ నేపథ్యంలో తన అమ్ములపొదిలోని టి-72 యుద్ధ ట్యాంకుకు ప్రత్యేకంగా మార్పులు చేసి, 2014లో తూర్పు లద్దాఖ్‌లో భారత్‌ మోహరించింది. తీవ్ర శీతల వాతావరణాన్ని తట్టుకొనే కందెనలు, ప్రత్యేక ‘వింటర్‌ గ్రేడ్‌ డీజిల్‌’ సాయంతో వాటిని నిర్వహిస్తోంది. రాత్రివేళ ఈ యంత్రాలను వేడిగా ఉంచేందుకు కనీసం రెండుసార్లు ఇంజిన్లను ఆన్‌ చేయడం వంటి చర్యలను మన సైనికులు చేపట్టేవారు. *తరలింపు ఇలా..*

2015 నుంచి విస్తృత స్థాయిలో ట్యాంకులను లద్దాఖ్‌కు తరలించడం భారత్‌ మొదలుపెట్టింది. 45 టన్నుల బరువుండే ఈ శకటాలను తొలుత.. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఉన్న లేహ్‌ విమానాశ్రయానికి వాయు మార్గంలో తరలించాలి. అక్కడి నుంచి తూర్పు లద్దాఖ్‌లోని గమ్యస్థానానికి చేర్చాలి. ‘‘2015-16లో ‘సి-17 గ్లోబ్‌మాస్టర్‌’ రవాణా విమానంలో విడతకు ఒక ట్యాంకును మాత్రమే తరలించాం. రోజుకు ఒక్కసారి మాత్రమే విమానాన్ని నడిపాం. ఆ తర్వాత ఒక విడతలో రెండు ట్యాంకులను తరలించాం. రోజుకు ఒకటి కన్నా ఎక్కువ సర్వీసులను నడిపాం. ఏడాది పాటు ఈ కసరత్తు సాగింది. ఆ తర్వాత అధునాతనమైన టి-90 ట్యాంకులను తరలించాం. ఇప్పుడు ఎలాంటి ట్యాంకు యుద్ధానికైనా మేం సిద్ధం’’ అని సైనిక ఉన్నతాధికారి ఒకరు ‘ఈటీవీ భారత్‌’తో తెలిపారు. ప్రస్తుతం లద్దాఖ్‌లో వందల ట్యాంకులు కొలువుదీరాయి. *ఎంత కాలమైనా సరే..* చైనా వెనక్కి తగ్గేవరకూ.. సరిహద్దుల్లో ఎంతకాలమైనా మోహరింపును కొనసాగించాలని భారత సేన భావిస్తోంది. ఇప్పటికే గల్వాన్‌ నదిలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. శీతాకాలం మొదలైతే గల్వాన్‌ ఒడ్డున చైనా సైనికుల మనుగడ కష్టమవుతుంది. మన సైన్యం మాత్రం ఎత్తయిన ప్రాంతంలో మోహరించింది. *రాటుదేలిన భారత సైనికుడు..* తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌లోకి మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణులను రంగంలోకి దించామని చైనా అధికారిక మీడియా ఊదరగొడుతోంది. అయితే డ్రాగన్‌ సైనికులతో పోలిస్తే భారత సైనికుడు రాటు దేలి ఉన్నాడు. సియాచిన్‌ ప్రాంతం పాకిస్థాన్‌ పరం కాకుండా చూసేందుకు 1984 నుంచి మన సైనికులు పర్వత ప్రాంత యుద్ధంలో సుశిక్షితులై ఉన్నారు. పైగా పదాతి దళంలో సుశిక్షితులైన సైనికులతో కూడిన ‘ఘాతక్‌ ప్లటూన్‌’లను భారత్‌ ఇప్పటికే చైనా సరిహద్దుల్లో మోహరించింది. ఈ యోధులు ప్రత్యేక కమాండో శిక్షణ పొందారు. శత్రు స్థావరాల్లో చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించడంలో వీరు నిష్ణాతులు. ఆయుధాలు లేకుండానే ప్రత్యర్థిని మట్టికరిపించే స్థాయిలో దేహదారుఢ్యం, శిక్షణ వీరి సొంతం. *గల్వాన్‌ లోయలో టి-90లు* సరిహద్దు ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైన గల్వాన్‌ లోయలో భారత సైన్యం తాజాగా ఆరు టి-90 ట్యాంకులను మోహరించింది. వీటికితోడు భుజంపై నుంచి ప్రయోగించే వీలున్న ట్యాంకు విధ్వంసక క్షిపణి వ్యవస్థలనూ రంగంలోకి దించింది. టి-90 ట్యాంకు కూడా క్షిపణులనూ ప్రయోగించగలదు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంబడి పదాతి దళ సాయుధ శకటాలు, శతఘ్నులనూ భారత్‌ మోహరించింది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading