గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పేటీఎం తొలగింపు

Spread the love

*గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పేటీఎం తొలగింపు*

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ పేటీఎంను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి శుక్రవారం తొలగించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను కూడా తీసివేసింది. పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఇది వరకే పేటీఎంకు గూగుల్‌ నోటీసులు జారీ చేసిందని, తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ నిబంధనల ప్రకారం..

ఎలాంటి జూదాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులు నిర్వహించకూడదు. కానీ, పేటీఎం, పేటీఎం ఫస్ట్‌గేమ్‌ యాప్స్‌ ద్వారా ఫాంటసీ క్రికెట్‌ సేవలను ప్రారంభించింది.

జూదాన్ని ప్రోత్సహించేదిగా ఈ చర్య ఉండడంతో గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడంపై పేటీఎం స్పందించింది. గూగుల్‌ ప్లేలో ప్రస్తుతానికి పేటీఎం ఆండ్రాయిడ్‌ యాప్‌ కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, అప్‌డేట్‌ చేసుకోవడానికి అందుబాటులో లేదని పేర్కొంది. త్వరలో మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది. ప్రస్తుతానికి పేటీఎం యాప్‌ను యథావిధిగా వినియోగించుకోవచ్చని, అందులో సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదని ట్వీట్‌ చేసింది.

ప్రస్తుతం పేటీఎంకు 5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. పేటీఎం ఐవోఎస్‌ వెర్షన్‌ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *