* యూపీ సర్కారుపై సుప్రీం అసహనం* *ఇతర రాష్ట్రాలూ రేషన్ ఇవ్వాలని సూచన*
దిల్లీ: కొవిడ్-19 సంక్షోభ సమయంలో జీవనోపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ పంపిణీ చేయాలని జారీ చేసిన ఆదేశాల మేరకు లబ్ధిదారులను గుర్తించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇది మరొకరి జీవనానికి సంబంధించిన సమస్య కాబట్టి, ఆలస్యం తగదని వ్యాఖ్యానించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషను (నాకో) గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఉచిత రేషను పంపిణీ చేయాలంటూ సెప్టెంబర్ 29న తాను జారీ చేసిన సూచనలను అమలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తర్వుల అమలుకు నాలుగు వారాల సమయం ఇచ్చినా చేయకపోతే.. అది రాష్ట్రాల అసమర్థతను సూచిస్తుందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
మహారాష్ట్రలోని 8 జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికలను సమీక్షించిన ధర్మాసనం… వాటిలో సారుప్యత లేదని పేర్కొంది. ఈ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని… ఈ మేరకు రెండు వారాల్లో సమ్మతి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది