*గాన గంధర్వుడు ఎస్పీ బాలు అస్తమయం*
చెన్నై: సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుది శ్వాస విడిచారు. కరోనా సోకి.. స్వల్ప లక్షణాలతో ఆగస్టు 5న ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలు.. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చింది.
అయితే కరోనా నుంచి కోలుకున్నా.. ఎస్పీ బాలుకు ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఇంకా ఉండటంతో 52 రోజులుగా ఆస్పత్రిలోనే వైద్యం అందించారు.
బాలు మృతి పట్ల యావత్ సినీ, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.
ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. ఒక మహోన్నత గాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.