*తెరాస మేయర్‌ వ్యూహమేంటో

Spread the love

*తెరాస మేయర్‌ వ్యూహమేంటో?* *ఎక్స్‌అఫిషియోలతోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరమే*

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మేయర్‌ పదవి దక్కించుకోవడానికి తెరాస వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.

150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో 55 స్థానాలతో అది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలం కలిసినా తెరాస మేయర్‌ పదవిని దక్కించుకోలేదు. దీంతో ఎంఐఎంతో కలిసి ముందుకెళ్తుందా  లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో 99 డివిజన్లను తెరాసనే గెల్చుకోవడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు ఆ పార్టీకే దక్కాయి. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లతోపాటు 45 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు.

కొత్త మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికప్పుడు ఎక్స్‌అఫిషియో సభ్యుల నమోదుకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇస్తారు. ఇతర నగరపాలక సంస్థలు, పురపాలికల్లో ఓటు వేయకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడ నమోదు చేసుకొంటే వారు కూడా ఓటు వేయడానికి అర్హులు. ప్రస్తుతం ఉన్న సంఖ్య ప్రకారం జీహెచ్‌ఎంసీ మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవడానికి 98 ఓట్లు అవసరం.

గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు కలిపి తెరాసకు 87 మంది ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు కూడా ఇక్కడే ఓటు ఇచ్చినా కూడా మరో ఏడెనిమిది ఓట్లు అవసరమవుతాయి. జీహెచ్‌ఎంసీలో 44 స్థానాలు పొందిన మజ్లిస్‌ కనుక మద్దతు తెలిపితే తెరాసకు ఎక్స్‌అఫిషియో సభ్యుల అవసరం ఉండదు. *మజ్లిస్‌ నేరుగా మద్దతు ఇవ్వకుండా ఓటింగుకు గైర్హాజరయినా….*

మేయర్‌ ఎన్నిక నాడు ఆ రోజున హాజరయ్యే సభ్యుల్లో మెజారిటీ ఉన్న పార్టీ అభ్యర్థిని మేయర్‌గా ఎన్నుకుంటారు.తర్వాత డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కూడా అలాగే జరుగుతుంది. తెరాసకు మజ్లిస్‌ నేరుగా మద్దతు ఇవ్వకుండా ఓటింగుకు గైర్హాజరయితే మేయర్‌ పదవి తెరాసకు సులభంగా లభిస్తుంది. ఈ అంశంపైనా చర్చ సాగుతోంది. 

ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి పది వరకు గడువుంది. కొత్త మేయర్‌ ఎంపికపై ఆ లోపు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

*మేయర్‌ పదవిపై ఆశావహులు ఎందరో…*

మేయర్‌ పదవికి తెరాస నుంచి సింధు ఆదర్శ్‌రెడ్డి(భారతీనగర్‌), ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి (వెంకటేశ్వరనగర్‌ కాలనీ), ప్రస్తుత మేయరు బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవియాదవ్‌ (చర్లపల్లి), పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి (ఖైరతాబాద్‌), మన్నె కవితారెడ్డి (బంజారాహిల్స్‌), ఇతర కార్పొరేటర్లు విజయశాంతి (అల్వాల్‌), పూజిత (హఫీజ్‌పేట) తదితరులు ఆసక్తి చూపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *