ఎల్‌ఆర్‌ఎస్‌ ఛార్జీలు తగ్గాయి

Spread the love

*ఎల్‌ఆర్‌ఎస్‌ ఛార్జీలు తగ్గాయి*

*నాలుగు శ్లాబ్‌లకు బదులు ఏడుగా విభజన*

*నాలా రుసుం రద్దు*

*ఖాళీ స్థలాల ఛార్జీలకు రిజిస్ట్రేషన్‌ నాటి భూమి విలువే పరిగణనలోకి* *తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ* హైదరాబాద్‌: రాష్ట్రంలో అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) ఛార్జీలు తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చదరపు గజం ధర ఆధారంగా క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన ఛార్జీల శ్లాబ్‌లను పెంచింది. నిర్దేశించిన ఖాళీ స్థలాలు వదలని చోట చెల్లించాల్సిన రుసుంకు రిజిస్ట్రేషన్‌ సమయంలో సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్ణయించిన ధరనే ప్రాతిపదిక చేసింది. ప్రత్యేకంగా నాలా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఛార్జీల భారం తగ్గిస్తామని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు బుధవారం శాసనసభలో వెల్లడించగా ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం జీవో నంబరు 135 జారీ చేశారు. గత నెల 31వ తేదీ జారీ చేసిన జీవో నంబరు 131 ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ ఛార్జీలకు నాలుగు శ్లాబ్‌లను నిర్దేశించగా గురువారం జారీ చేసిన ఉత్తర్వులలో ఏడు శ్లాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. గత జీవో ప్రకారం గజం భూమి విలువ పదివేల రూపాయలకు పైన ఉంటే వందశాతం క్రమబద్ధీకరణ రుసుం చెల్లించాల్సి ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం చదరపు గజం రూ.50,001 పైన ఉంటేనే వంద శాతం రెగ్యులరైజేషన్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పదివేల రూపాయలు.. అంతకంటే తక్కువ ఉంటే గరిష్ఠంగా 40 శాతం చెల్లిస్తే సరిపోతుంది. 2015లో జారీ చేసిన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ జీవోలో ఏడు శ్లాబ్‌లు ఉండగా ఇప్పుడు మళ్లీ అన్నే శ్లాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. *సబ్‌రిజిస్ట్రార్‌ నిర్ణయించిన ధర వర్తింపు* అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్‌లలో నిర్దేశించిన 10 శాతం ఖాళీ జాగా లేకుంటే రెగ్యులరైజేషన్‌కు చెల్లించాల్సిన 14 శాతం ఛార్జీలకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు సబ్‌రిజిస్ట్రార్‌ నిర్ణయించిన భూమి ధరను పరిగణనలోకి తీసుకుంటామని తాజా జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఇంతక్రితం విడుదల చేసిన 131 నంబరు జీవోలో ఈ ఏడాది ఆగస్టు 26 నాటి ధర ప్రాతిపదికగా ఉండేది.

*నాలా ఛార్జీల రద్దు పెద్ద ఊరట* ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు నాలా ఛార్జీలు పెద్ద భారంగా ఉండేవి. నాలా ఛార్జీ 3 శాతంతో పాటు పెనాల్టీ 1.5 శాతం వసూలు చేసేవారు. తాజాగా ప్రత్యేకంగా నాలా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుదారులకు ఊరట లభించినట్లైంది.

*ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు*

హైదరాబాద్‌: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ నిమిత్తం ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131 వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవో రాజ్యాంగబద్ధతకు సంబంధించి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలంది. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్‌ ఎం.పద్మనాభరెడ్డి(ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తరఫున కార్యదర్శి) అభ్యర్థనను తిరస్కరిస్తూ విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. జీవో 131 పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎస్‌, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీయేలకు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *