*విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు*
న్యూఢిల్లీ: దేశంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులకు చదువుకునే అవకాశాలు కల్పించేందుకు, కోవిడ్–19 కారణంగా విదేశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు సైతం ఇక్కడ చదువు కొనసాగించే అవకాశం కల్పించే లక్ష్యంతో రూపొందించే కార్యక్రమానికి మార్గదర్శకాలను తయారుచేయడం కోసం మానవ వనరుల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ సారథ్యంలోని ఈ కమిటీ, ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో మరింత మందిని చేర్చుకునే అవకాశాలపై సైతం సిఫారసులు చేయనుంది.
ఈ కమిటీ 15 రోజుల్లోగా తన రిపోర్టు అందించాల్సి ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న అనేక మంది విద్యార్థులు కోవిడ్ –19 కారణంగా యిప్పుడు భారత్‌లోనే చదువుకోవాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కి తిరిగి వచ్చే విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతోంది’’అని ‘‘స్టే ఇన్ ఇండియా అండ్ స్టడీ ఇన్ ఇండియా’’కార్యక్రమంలో హెచ్చార్డీ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ చెప్పారు.
గత ఏడాది 7.5 లక్షల మంది విద్యార్థులు తమ చదువుకోసం విదేశాలకు వెళ్ళారని ఆయన చెప్పారు.
‘‘ఈ ప్రతిభావంతులైన విద్యార్థులందర్నీ మన దేశంలోనే చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టాలి’’
అలాగే ప్రభుత్వం ప్రణాళికలో పేర్కొన్నట్లు ప్రముఖ విద్యాలయాలన్నింటిలోనూ 2024 కల్లా సీట్ల సామర్థ్యాన్ని 50 శాతం పెంచాలనీ, 2024కి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను 50కి పెంచాలని మంత్రి నిశాంక్ అన్నారు.