హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

0

*హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌* *ప్రాణాంతక వైరస్‌ గుట్టు విప్పిన హార్వీ, రైస్‌, హౌటన్‌లకు వైద్య విభాగంలో పట్టం

* *వీరి పరిశోధనతో కోట్ల ప్రాణాలు నిలిచాయి*

*ఎంపిక కమిటీ కితాబు* ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న ‘హెపటైటిస్‌ సి’ వైరస్‌ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది. 1970, 1980ల నాటి వీరి పరిశోధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని అవార్డు ఎంపిక కమిటీ కొనియాడింది. అమెరికాకు చెందిన హార్వీ జె ఆల్టర్‌, చార్లెస్‌ ఎం రైస్‌, బ్రిటన్‌లో జన్మించిన మైఖేల్‌ హౌటన్‌లకు ఈ ఘనత దక్కింది. ఈ పురస్కారం కింద వీరికి 11,18,000 డాలర్లు దక్కుతాయి. ఈ మొత్తాన్ని ముగ్గురికీ సమానంగా పంచుతారు. 

*స్టాక్‌హోం* : తీవ్ర కాలేయ వ్యాధికి కారణమవుతున్న ‘హెపటైటిస్‌ సి’ వైరస్‌ను కనుగొన్న  అమెరికా శాస్త్రవేత్తలు హార్వీ జె ఆల్టర్‌, చార్లెస్‌ ఎం రైస్‌, బ్రిటన్‌లో జన్మించిన మైఖేల్‌ హౌటన్‌లను నోబెల్‌ వరించింది. వీరి కృషి వల్ల కోట్ల మంది ఈ ప్రాణాంతక రుగ్మత కోరల నుంచి బయటపడ్డారు. అప్పటికే కనుగొన్న హెపటైటిస్‌ ఎ, బి వైరస్‌లకు భిన్నంగా రక్తం ద్వారా వ్యాపించే హెపటైటిస్‌కు కారణం.. ఈ ముగ్గురి పరిశోధన వల్ల ఆవిష్కృతమైందని నోబెల్‌ కమిటీ పేర్కొంది. ‘‘వీరి పరిశోధన కారణంగా.. వైరస్‌ను గుర్తించడానికి మెరుగైన రక్త పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. రక్త మార్పిడి తర్వాత వచ్చే హెపటైటిస్‌ను ప్రపంచంలో అనేకచోట్ల దాదాపుగా నిర్మూలించారు. ఫలితంగా ప్రజారోగ్యం చాలావరకూ మెరుగుపడింది’’ అని వివరించింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల ఆవిష్కరణ కారణంగా ‘హెపటైటిస్‌ సి’ని లక్ష్యంగా చేసుకునే యాంటీవైరల్‌ ఔషధాలను వేగంగా అభివృద్ధి చేయడానికి వీలైందని తెలిపింది. ‘‘చరిత్రలో తొలిసారిగా హెపటైటిస్‌ సి వైరస్‌ను ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి’’ అని పేర్కొంది.

*ఎ.. బి.. సి.. !* హెపటైటిస్‌ ఎ.. నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. సాధారణ కామెర్లకు కారణమవుతున్న వైరస్‌ ఇదే. కొద్దివారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. హెపటైటిస్‌ బి, సి.. రక్తం ద్వారా వ్యాప్తి చెందుతాయి. అయితే రక్తమార్పిడి చేయించుకున్న కొందరు ఆరోగ్యవంతుల్లో అంతుచిక్కని రీతిలో దీర్ఘకాల హెపటైటిస్‌ తలెత్తుతున్నట్లు 1970లలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా వారి కాలేయాలు దెబ్బతింటున్నాయని తేల్చారు. దీనికి ‘ఎ’, ‘బి’లు కారణం కాదని వెల్లడైంది. వైరస్‌లను పసిగట్టేందుకు ఉపయోగించే అన్ని సంప్రదాయ విధానాలను ప్రయోగించినప్పటికీ.. అంతుచిక్కని ఆ వ్యాధి కారకం బోధపడలేదు. ఈ లోగా రక్త మార్పిడి చేయించుకుంటున్న అనేక మంది సదరు వ్యాధి బారినపడుతుండటంతో ఆందోళనలు పెరిగిపోయాయి.

*ఫోన్‌ మీద ఫోన్‌..* నోబెల్‌కు ఎంపికైన విషయాన్ని తెలియజేయడానికి ముగ్గురు విజేతలకు పదేపదే ఫోన్‌ చేయాల్సి వచ్చిందని ఎంపిక కమిటీ సెక్రటరీ జనరల్‌ థామస్‌ పెర్ల్‌మాన్‌ తెలిపారు. పలుమార్లు ప్రయత్నించాక ఆల్టర్‌, రైస్‌లు తనకు అందుబాట్లోకి వచ్చారని చెప్పారు. పురస్కారానికి ఎంపికైన విషయం తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారని పేర్కొన్నారు. ప్రపంచం నేడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకున్న నేపథ్యంలో ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్‌ పురస్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది.

*తొలి ఆవిష్కారం..* నాడు అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌లో పనిచేస్తున్న ఆల్టర్‌ తొలుత దీనిపై తొలి ఆవిష్కారం చేశారు. ప్లాస్మాలో ‘హెపటైటిస్‌ బి’ లేని రోగుల ద్వారా కూడా ఆ అంతుచిక్కని వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. సదరు వ్యాధి కారకానికి వైరస్‌ లక్షణాలు ఉన్నాయని తేల్చారు.

*రెండో అడుగు..* ఆ తర్వాత 1989లో మైఖేల్‌ హౌటన్‌, ఆయన సహచరులు మరో కీలక ముందడుగు వేశారు. మాలిక్యూలర్‌ బయాలజీ, ఇమ్యునాలజీ ఆధారిత విధానాలను ప్రయోగించి ఆ వైరస్‌ను క్లోన్‌ చేశారు. దీని జన్యుపటాన్ని వెలుగులోకి తెచ్చారు. దీనికి ‘హెపటైటిస్‌ సి’ అని పేరు పెట్టారు. అంతుచిక్కని హెపటైటిస్‌కు ఈ వైరస్సే కారణమై ఉండొచ్చడానికి కొన్ని ఆధారాలను సేకరించారు. అయితే ఆ వైరస్‌ ఒక్కటే ఈ రుగ్మతను కలిగిస్తోందా అన్న ప్రశ్నకు నిర్దిష్ట సమాధానం దొరకలేదు. దీన్ని నిగ్గు తేల్చాలంటే క్లోన్‌ చేసిన సదరు వైరస్‌.. తన ప్రతిరూపాలను సృష్టించుకొని, ఆ వ్యాధిని కలిగిస్తుందా అన్నది గుర్తించాలి. *అంతిమ నిర్ధారణ* ఆ తర్వాత 1989లో మైఖేల్‌ హౌటన్‌, ఆయన సహచరులు మరో కీలక ముందడుగు వేశారు. మాలిక్యూలర్‌ బయాలజీ, ఇమ్యునాలజీ ఆధారిత విధానాలను ప్రయోగించి ఆ వైరస్‌ను క్లోన్‌ చేశారు. దీని జన్యుపటాన్ని వెలుగులోకి తెచ్చారు. దీనికి ‘హెపటైటిస్‌ సి’ అని పేరు పెట్టారు. అంతుచిక్కని హెపటైటిస్‌కు ఈ వైరస్సే కారణమై ఉండొచ్చడానికి కొన్ని ఆధారాలను సేకరించారు. అయితే ఆ వైరస్‌ ఒక్కటే ఈ రుగ్మతను కలిగిస్తోందా అన్న ప్రశ్నకు నిర్దిష్ట సమాధానం దొరకలేదు. దీన్ని నిగ్గు తేల్చాలంటే క్లోన్‌ చేసిన సదరు వైరస్‌.. తన ప్రతిరూపాలను సృష్టించుకొని, ఆ వ్యాధిని కలిగిస్తుందా అన్నది గుర్తించాలి. అప్పట్లో వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న శాస్త్రవేత్త చార్లెస్‌ ఎం రైస్‌ ఈ దిశగా అంతిమ ఆవిష్కారం చేశారు. ‘హెపటైటిస్‌ సి’ జన్యుక్రమం అంచుల్లో ఒక ప్రాంతం.. వైరస్‌ పునరుత్పత్తికి కీలకం కావొచ్చని భావించారు. సేకరించిన వైరస్‌ నమూనాల్లో కొన్ని జన్యు మార్పులనూ గుర్తించారు. వీటిలో కొన్ని.. ఆ సూక్ష్మజీవి పునరుత్పాదకతకు అవరోధం కావొచ్చని అంచనావేశారు. జన్యు ఇంజినీరింగ్‌ ద్వారా ‘హెపటైటిస్‌ సి’కి సంబంధించిన ఆర్‌ఎన్‌ఏ రకాన్ని తయారుచేశారు. ప్రతిరూపాల తయారీకి ఆటంకంగా మారిన జన్యు వైరుధ్యాలు ఇందులో లేకుండా చూశారు. ఈ ఆర్‌ఎన్‌ఏను చింపాంజీల కాలేయంలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాటి రక్తంలో వైరస్‌ ఉనికి కనిపించింది. మానవుల్లో అంతుచిక్కని హెపటైటిస్‌ వ్యాధి లక్షణాలతో పోలిన రుగ్మతలు ఆ జీవుల్లోనూ ప్రారంభమయ్యాయి. దీంతో హెపటైటిస్‌ సి కారణంగానే ఆ వ్యాధి తలెత్తుతున్నట్లు నిర్ధారణ అయింది. హెపటైటిస్‌ సి.. ‘ఫ్లావివైరస్‌’ జాతికి చెందింది. వెస్ట్‌ నైల్‌, డెంగీ, యెల్లో ఫీవర్‌ వైరస్‌లు కూడా ఈ కోవలోకే వస్తాయి. *కోట్ల మందికి..* _ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికిపైగా హెపటైటిస్‌ సి బాధితులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా. ఏటా 4లక్షల మంది దీనివల్ల చనిపోతున్నారు. ఇది దీర్ఘకాల వ్యాధి. కాలేయ క్యాన్సర్‌, సిరోసిస్‌కు ప్రధాన కారణమవుతోంది. ఈ రుగ్మత వల్ల కాలేయ మార్పిడి అవసరమవుతోంది._

Leave a Reply