రోజుకు రూ. 1.5 కోట్లు !

Teluguwonders:
ముంబై: ప్రపంచ ఛాంపియన్ షిప్ స్వర్ణ పతకంతో కెరీర్ శిఖరాగ్రానికి చేరిన తెలుగు షట్లర్ పీవీ సింధు.. ఎండార్స్‌మెంట్ల విషయంలోనూ అదే స్థాయిలో దూసుకుపోతోంది. ప్రకటనల పరిశ్రమ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రోజుకు సగటున రూ. 65 నుంచి 85 లక్షలు సింధు తీసుకుంటోంది. అయితే కొన్ని ఎండార్స్‌మెంట్లలో ఇది రూ. 1.50 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన దరిమిలా సింధు ప్రకటనల ఫీజులో 50నుంచి 70 శాతం పెరుగుదల సహజమేనని స్పోర్ట్స్ కన్సల్టెంట్లు చెబుతున్నారు. ‘ప్రస్తుతం ప్రకటనలకు అత్యధిక మొత్తం తీసుకుంటున్న దేశ మహిళా అథ్లెట్లలో సింధు అగ్రస్థానంలో ఉంది.
క్రికెటర్లతో సమానంగా తనకూ చెల్లించాలని డిమాండ్ చేయగల సత్తా కూడా ఆమెకుంది’ అని బేస్‌లైన్ వెంచర్స్ కో ఫౌండర్ ఆర్. రామకృష్ణన్ అన్నారు. బేస్ లైన్ వెంచర్స్ సింధు టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ కూడా కావడం గమనార్హం. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో..
ఈ ఏడాదికి అత్యధిక ఆర్జన కలిగిన ప్రపంచ మహిళా అథ్లెట్లలో సింధు 13వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె ఏడాది ప్రకటనల ఆదాయం రూ. 35 కోట్లుగా ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చైనాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత క్రీడా పరికరాల సంస్థ లీ నింగ్‌తో సింధు రూ. 50 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
