మానసిక దృఢత్వంతోనే ఆరోగ్యం *శ్రీశ్రీ

0

*మానసిక దృఢత్వంతోనే ఆరోగ్యం* *శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ ఉద్బోధ*

బెంగళూరు: ప్రతి ఒక్కరికీ మానసిక దృఢత్వం అవసరమని బెంగళూరులోని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ ఉద్బోధించారు. సోమవారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక సందేశమిచ్చారు. ‘కొవిడ్‌ మహమ్మారితో పలువురు తమ ఆప్తులు, బంధుమిత్రులను కోల్పోయి ఇళ్లలో 4 గోడల మధ్య బందీలుగా మారిపోయారు. ఆందోళన, బాధ, ఆవేదన కలిసి ఉన్న ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మనం మానసికంగా దృఢంగా ఉండాలి. వాస్తవానికి మనందరిలోనూ ఆ బలం మొదటి నుంచీ ఉన్నప్పటికీ, దానిని ఇప్పటి వరకూ గుర్తించేందుకు సరైన సమయం దొరకలేదు. ఈ మహమ్మారి మనకు ఆ అవకాశాన్ని కల్పించింది. చాలా రోజుల నుంచి సమయం లేక వాయిదా వేస్తూ వస్తున్న పనులు చేసేందుకు, మన గురించి మనం తెలుసుకునేందుకు సమయం లభించింది. మనలోని ధైర్యాన్ని, వీరత్వాన్ని వెలికి తీసేందుకు, అందరితో కలసికట్టుగా ఈ కష్టాన్ని ఎదుర్కొనేందుకు సరైన సమయం ఇదే. దీనికి ఆధ్యాత్మికత మనకు తోడుగా నిలబడుతుంది.

కరోనాతో మానసిక సమస్యలు, మధుమేహం, రక్తపోటు సమస్యలూ ఎక్కువయ్యాయి. ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన అమూల్యమైన వరాల్లో యోగా, ధ్యానం ప్రధానమైనవి. ఇవి పటిష్టమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్మిస్తాయి. యోగా మనల్ని శారీరకంగా, ఆరోగ్యంగా ఉంచి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మన భావావేశాలను సమతుల్యంగా ఉంచుతుంది. బుద్ధిని చురుగ్గా చేయడంతోపాటు, మనసును నిశ్శబ్దంగా ఉంచి, మనచుట్టూ చక్కని భావ తరంగాలను వ్యాప్తి చేస్తుంది. నిత్యం యోగా సాధన చేయండి.

ప్రాణాయామం చేసిన తరువాత ధ్యానం చేయండి. లేదంటే యోగా అనేది కేవలం శారీరక వ్యాయామంగానే మిగిలిపోతుంది. పతంజలి మహర్షి చెప్పిన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగాలను పాటించిన వ్యక్తుల జీవితంలో సమూలమైన మార్పులు ఉంటాయి. బలహీనత నుంచి బలానికి, నీరసం నుంచి శక్తిమంతమైన స్థితికి, దుఃఖం నుంచి సంతోషానికి, అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్యానికి ఎదగవచ్చు.

యోగా సాధన చేసేందుకు ప్రత్యేక నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. ఏ మతాన్ని అనుసరించే వారైనా యోగాసనాలను వేయవచ్చు’ అని గురూజీ తన సందేశంలో పేర్కొన్నారు. _

Leave a Reply