వేగంగా వెళ్లేలా.. వెలుగులీనేలా!

*వేగంగా వెళ్లేలా.. వెలుగులీనేలా!* *హైటెక్ సిటీ రహదారులకు సరికొత్త సొబగులు* *అందుబాటులోకి వచ్చిన కూడళ్లు, వంతెనలు* ఈనాడు – హైదరాబాద్: అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. నగరానికి మణికిరీటం లాంటి ఐటీ కారిడార్‌లో అనేక మార్గాలు కొత్తరూపు సంతరించు కుంటున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఎస్సార్డీపీ పథకం రూపుదిద్దుకోగా.. దీని ద్వారా నగరం నలుమూలల భారీ ఎత్తున రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ప్రత్యేకించి ఖాజాగూడ నుంచి జేఎన్‌టీయూ వరకు ఉన్న రోడ్డు మార్గం అభివృద్ధికి నాలుగో దశ పనులకు ప్రణాళిక రూపొందించారు. నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ పనులు గురువారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన బయోడైవర్సిటీ కూడలి మొదటిస్థాయి పైవంతెనతో పూర్తయినట్లు అయింది. *నాలుగో దశ అభివృద్ధి ఫలాలు ఇవీ..* 1. *రాజీవ్ గాంధీ కూడలి పైవంతెన:* జేఎన్‌టీయూ నుంచి మలేషియన్ టౌన్‌షిప్ వరకు రూ.97.93 కోట్లతో 1.23 కి.మీ. పొడవున నిర్మించారు. గత ఏడాది ఏప్రిల్ 6న అందుబాటులోకి వచ్చింది. సైబర్ టవ ర్స్-జేఎన్‌టీయూ మధ్య రద్దీకి ఇది పరిష్కారం చూపింది. 2. *అయ్యప్ప సొసైటీ కూడలి అండర్‌పాస్:* రూ.44.3 కోట్లతో 450 మీటర్ల పొడవున నిర్మించారు. మెటల్ చార్మినార్ నుంచి అయ్యప్ప సొసైటీ రోడ్డుకు క్షణాల్లో చేరుకోవచ్చు. జనవరి 3, 2018న ప్రారంభించారు. 3 *_మైండ్‌స్పేస్ కూడలి పైవంతెన:_* రాడిసన్ హోటల్-ఇనార్బిట్‌మాల్ మధ్యలో మైండ్‌స్పేస్ కూడలిపై రూ.80.23 కోట్లతో నిర్మాణం. నవంబరు 9, 2018న అందుబాటులోకి వచ్చింది. 4. *మైండ్‌స్పేస్ అండర్‌పాస్:* బయోడైవర్సిటీ కూడలి-సైబర్ టవర్స్ మార్గంలో ప్రయాణించే వాహనాలు ఆగకుండా సాగిపోవచ్చు. నిర్మాణ వ్యయం రూ.51.41కోట్లు. ఏప్రిల్ 28, 2018న ప్రారంభించారు. 5. *బయోడైవర్సిటీ కూడలి రెండోస్థాయి పైవంతెన* : బయోడైవర్సిటీ కూడలిలో 990 మీటర్ల పొడవున రూ.69.12 కోట్లతో నిర్మించారు. గత ఏడాది నవంబరు 4న అందుబాటులోకి తెచ్చారు. 6. *మొదటిస్థాయి పైవంతెన* : గచ్చిబౌలి- ఖాజాగూడ వైపు బయోడైవర్సిటీ కూడలిలో రూ.30.26 కోట్లతో నిర్మించారు. తాజాగా అందుబాటులోకి వచ్చింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
