కరాచీ విమాన ప్రమాదం: 97 మంది మృతి. సజీవంగా బయటపడ్డ ఇద్దరు

పాకిస్తాన్ విమాన ప్రమాదంలో మొత్తం 97 మంది మృతిచెందినట్లు ఆ దేశంలోని సింధ్ ప్రావిన్స్ అధికారులు ధ్రువీకరించారు.
విమానంలో 8 మంది సిబ్బంది సహా మొత్తం 99 మంది ఉండగా ఇద్దరు సజీవంగా బయటపడ్డారు.
60 మృతదేహాలు జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్(జేపీఎంసీ), మిగతావి కరాచీ సివిల్ హాస్పిటల్(సీహెచ్‌కే)లో ఉన్నాయని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో 19 మందిని గుర్తించామని, మిగతవారిని గుర్తించే ప్రక్రియ సాగుతుందని తెలిపారు.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం కరాచీ విమానాశ్రయానికి సమీపంలోని ఒక కాలనీ వద్ద శుక్రవారం కూలిపోయింది.
పాకిస్తాన్‌లోని లాహోర్ నగరం నుంచి కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏటీసీతో విమానం సిగ్నల్స్ తెగిపోయాయి.
ఎలా కూలిపోయింది?
విమానం దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని, దాంతో పైలట్ మరోసారి ప్రయత్నించేసరికి విమానం కూలిపోయిందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ అర్షద్ మాలిక్ తెలిపారు.
విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పైలట్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చెప్పారన్నారాయన.
విమానం ఒక చిన్న వీధిలో కూలిపోయిందని.. అందువల్ల సహాయ చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాలిక్ తెలిపారు.
సహాయ చర్యలు పూర్తికావడానికి రెండుమూడు రోజులు పడుతుందని ఆయన చెప్పారు.

సింధ్ ముఖ్యమంత్రి కరాచీ నగరంలోని అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
కరాచీ విమానాశ్రయం పాకిస్తాన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి.
శిథిలాలను తొలగించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు.
‘‘వాళ్లంతా మా పొరుగువాళ్లే’’
విమానం కూలిపోయిన దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఉజైర్ ఖాన్ బీబీసీతో మాట్లాడుతూ.. భారీ శబ్దం వినిపించిందని, అప్పుడు తాను ఇంటి బయటకు వచ్చానని తెలిపారు.
‘‘దాదాపు నాలుగు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అక్కడంతా భారీగా మంటలు చెలరేగాయి. పొగ అలుముకుంది. వాళ్లంతా మా పొరుగువాళ్లే. ఇదెంత భయానకంగా ఉందో నేను మీకు చెప్పలేను’’ అని ఆయన అన్నారు.
డాక్టర్ ఖన్వాల్ నజీమ్ బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ.. ఒక మాస్కు పక్కన ఉన్న మూడు ఇళ్ల నుంచి భారీగా నల్లటి పొగలు రావటం తాను చూశానని, ప్రజలు భయంతో అరవటం విన్నానని చెప్పారు.
పాకిస్తాన్‌కు చెందిన దున్యా న్యూస్ పైలట్ సంభాషణగా చెబుతున్న ఒక ఆడియో టేపును వినిపించింది. ఈ సంభాషణను మానిటరింగ్ వెబ్‌సైట్ లైవ్ఏటీసీ.నెట్‌లో కూడా పెట్టారు.
‘‘రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయి’’ అని పైలట్ అనటం.. ఆ తర్వాత కొన్ని సెకన్లకు ‘‘మేడే, మేడే, మేడే’’ అని అరవటం వినిపిస్తోంది. ఆ తర్వాత సంభాషణ ఆగిపోయింది.

చిత్రం శీర్షికకరాచీ విమానాశ్రయం సమీపంలో విమానం కూలిన ప్రాంతంలో దట్టమైన పొగ

చిత్రం శీర్షికమోడల్ కాలనీ జనావాసాలకు సమీపంలో విమానం కూలింది
‘‘విమానంలో 99 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థరించాం’’ అని పాకిస్తాన్ ఏవియేషన్ అథార్టీ అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ ఖోఖర్ చెప్పారు.
పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ)కు చెందిన ఈ ఎయిర్ బస్ 320, PK8303 నంబరు గల విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు లాహోర్ నుంచి ప్రయాణం ప్రారంభించింది.
మరో కొద్ది నిమిషాల్లో జిన్నా విమానాశ్రయంలో దిగాల్సిన ఈ విమానం.. విమానాశ్రయానికి 3.2 కిలోమీటర్ల దూరంలో మోడల్ కాలనీ సమీపంలో కూలిపోయింది.
పాకిస్తాన్ ఆర్మీకి చెందిన క్విక్ రియాక్షన్ ఫోర్స్ బృందాలు వెను వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టాయని ఆర్మీ తెలిపింది.
కాగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తాను పీఐఏ సీఈఓతో మాట్లాడానని, ఆయన ఘటనా స్థలానికి వెళ్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు.
లాక్‌డౌన్ అనంతరం వాణిజ్య కార్యకలాపాల కోసం విమానాలను అనుమతించిన కొన్ని రోజులకే ఈ విమాన ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

పాకిస్తాన్‌లో విమాన ప్రమాదాలు
పాకిస్తాన్‌లో విమానయాన భద్రతా రికార్డు అంత మెరుగ్గా ఏమీ లేదు.
2010లో ఎయిర్ బ్లూ అనే ఒక ప్రైవేటు విమానయాన సంస్థ విమానం ఒకటి ఇస్లామాబాద్ సమీపంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ చరిత్రలో అత్యంత విషాద విమాన ప్రమాదం ఇదే.
2012లో పాకిస్తాన్ భోజ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737-200 విమానం ప్రతికూల వాతావరణం కారణంగా రావల్పిండిలో దిగేందుకు ప్రయత్నిస్తూ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 121 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది చనిపోయారు.
2016లో పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. ఉత్తర పాకిస్తాన్ నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 47 మంది చనిపోయారు.


ఎయిర్‌బస్ ఏ320 ప్రమాదాల టైం లైన్:
వరికూటి రామకృష్ణ, బీబీసీ ప్రతినిధి
మీరు విమానాల్లో ప్రయాణిస్తూ ఉంటే ఎయిర్‌బస్ పేరు తప్పకుండా వినే ఉంటారు. భారతదేశంలో అయితే ఎక్కువగా ఎయిర్‌బస్ విమానాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఏ320. పాకిస్తాన్‌లో కూలి పోయింది ఈ రకం విమానమే. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న విమానాల్లో బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ320 తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఏ320 సిరీస్‌ను ఎయిరిండియా, ఇండిగో, గోఎయిర్ వంటి భారత విమానయాన సంస్థలు కూడా వాడుతున్నాయి.
యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ 1984లో ఏ320 ప్రాజెక్ట్‌ను చేపట్టింది. 1987లో తొలి ఏ320 విమానం ఎగిరింది. ఆ తరువాత 1988 నుంచి వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎయిర్‌బస్ తయారు చేస్తున్న విమానాల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఏ320 సిరీస్‌కే. అయితే దీని ప్రయాణం మొదలైన నాటి నుంచి నేటి వరకు అనేక ప్రమాదాలు జరిగాయి. వాటిలో కొందరు మరణించగా మరికొందరు గాయపడ్డారు. కొన్ని ముఖ్యమైన ప్రమాదాలను చూస్తే…

– ఏ320 మార్కెట్‌లోకి వచ్చిన తొలి ఏడాది అంటే 1988లోనే తొలి ప్రమాదం జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ ఒక ఎయిర్‌షోలో దీన్ని ప్రదర్శిస్తుండగా క్రాష్ ల్యాండ్ అయింది. విమానంలో 136 మంది సిబ్బంది, ప్రయాణికులు ఉండగా ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.
-1990లో భారతదేశానికి చెందిన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమాన ప్రమాదంలో 88 మంది చనిపోయారు. ముంబయి నుంచి బెంగళూరు ప్రయాణిస్తున్న ఆ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది.
- 2014 డిసెంబర్‌లో ఇండోనేషియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిరేషియా విమానం QZ8501 జావా సముద్రంలో కూలి పోయింది. అందులో మొత్తం 162 మంది ఉండగా 106 మృతదేహాలు దొరికాయి.
2015 మార్చిలో బార్సిలోనా నుంచి దసెల్‌డార్ఫ్‌కు ప్రయాణిస్తున్న జర్మనీ వింగ్స్ 4U 9525, ఫ్రాన్స్ ఆల్ప్ఫ్ పర్వతాల్లో కూలి పోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 150 మంది చనిపోయారు.
2015 అక్టోబరులో ఈజిప్ట్ నుంచి రష్యాకు ప్రయాణిస్తున్న మెట్రోజెట్ ఫ్లైట్ 9268 కూలిపోవడంతో సిబ్బంది సహా 224 మంది చనిపోయారు. ఎయిర్‌బస్ ఏ321 రకానికి చెందిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈజిప్టులోని సినయి ప్రాంతంలో కూలిపోయింది. స్వయంప్రకటిత ఇస్లామిక్ స్టేట్ తామే కూల్చామని ప్రకటించుకోగా బాంబు పేలడం వల్లే విమానం కూలిపోయిందని రష్యా పరిశోధకులు ప్రకటించారు.
2016 మేలో పారిస్ నుంచి కైరోకు ప్రయాణిస్తున్న ఈజిప్ట్ ఎయిర్‌కు చెందిన MS804 ఏ320 విమానం తూర్పు మధ్యదరా సముద్రంలో కూలి పోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 66 మంది మరణించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.

