దేశంలో కరోనా ప్రళయం

*10 లక్షలు దాటి..*
*దేశంలో కరోనా ప్రళయం* *జులైలోనే 5 లక్షలు*
*ఒక్కరోజులో 34,956 కేసులు*
*25 వేలు దాటిన మరణాలు*
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. 25 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు రోజుల్లోనే లక్షా పాతిక వేల కేసులు పెరిగాయంటే ఉద్ధృతి ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం కేసులు, మరణాలు నమోదయ్యాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 34,956 కేసులు నమోదు కాగా, 687 మరణాలు సంభవించాయి. దేశంలో ఏప్రిల్ 14న కేసుల సంఖ్య 10 వేలు దాటింది. తర్వాత 3 నెలల్లోనే 10 లక్షలను అధిగమించింది. ఒక్క జులైలోనే 5 లక్షల కేసులు బయటపడ్డాయి. గత 2 రోజులుగా 32 వేలకు మించి నమోదవడం వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది.
*రాష్ట్రాల్లో విలయం* ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితి తీవ్రమవుతోంది. కేసులు ఇదివరకు పదుల్లో నమోదవుతున్న చోట్ల వందలు, వందలు నమోదయ్యే రాష్ట్రాల్లో వేల దిశగా పరిస్థితులు మారుతున్నాయి. ఎక్కడా తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించడం లేదు. వారం రోజులపాటు దిల్లీలో కొంత ఉపశమనం కనిపించినా 2 రోజులుగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గతంలో ఎన్నడూలేని విధంగా 24 గంటల్లో 8,641 కేసులు నమోదయ్యాయి. 266 మంది మృతి చెందారు. కర్ణాటకలో ఒకేరోజు 115 మంది చనిపోగా.. 3,693 కేసులు నమోదయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో రోజువారీ కేసుల సంఖ్య తొలిసారి 2 వేలను దాటింది. కేరళలో ఒకేరోజు 722 కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్, బిహార్, అసోంలలోనూ అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. తొలిసారి 2 రాష్ట్రాల్లో మూడంకెల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ ఈ జాబితాలో మహారాష్ట్ర మాత్రమే ఉండగా ఇప్పుడు కర్ణాటక చేరింది. మహానగరాల్లో దిల్లీ, ముంబయి, చెన్నైలలోనే దాదాపు 3 లక్షల కేసులున్నాయి. బెంగళూరులోనూ పాతిక వేలు దాటింది. రికవరీ రేటు మాత్రం దిల్లీ, చెన్నైల్లో కొంత మెరుగ్గా ఉంది. ముంబయిలోనూ ఫర్వాలేదనిపిస్తోంది. బెంగుళూరులో మాత్రం తక్కువగా ఉంది. అక్కడ 74.5% మేర యాక్టివ్ కేసులున్నాయి. దీంతో ఆసుపత్రులపై భారం పెరిగే ప్రమాదం ఉంది.
*దేశంలో కొవిడ్ తీరు..* * తొలి కేసు బయటపడిన నాటి నుంచి లక్ష కేసులు దాటడానికి 111 రోజులు పడితే.. 59 రోజుల్లోనే 9 లక్షల కేసులు నమోదయ్యాయి.
* ఒక రోజులో 28 వేలు దాటి కేసులు నమోదు కావడం వరుసగా ఇది ఆరోసారి (శుక్రవారం నాటికి).
* కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రికవరీ రేటు శుక్రవారానికి 63.33%గా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజులో 22,942 మంది కోలుకున్నారు.
* మరణాల రేటు 2.55%కి చేరింది.
* దేశంలో గురువారం నాటికి 1,30,72,718 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
* ప్రతి 10 లక్షల జనాభాకు 727.4 కేసులు నమోదవుతుండగా, 18.6 మరణాలు సంభవిస్తున్నాయి.
* దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 1.94 శాతం మంది ఐసీయూలో ఉండగా, 0.35 శాతం మంది వెంటిలేటర్లపైన, 2.81 శాతం మంది ఆక్సిజన్ పడకలపైన చికిత్స పొందుతున్నారు. మొత్తం కేసుల్లో లక్షణాలు లేనివి, స్వల్ప లక్షణాలున్నవి కలిసి దాదాపు 80 శాతం ఉన్నాయి. వీరంతా గృహ ఏకాంతవాసంలోనే ఉంటున్నారు.
* మొత్తం 31.6 లక్షల మంది ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 లక్షల మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలు మాత్రం గృహ ఏకాంతవాసానికి (హోం క్వారంటైన్) అనుమతించడం లేదు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
