10లో 100 శాతం ఉత్తీర్ణత

IMG-20200609-WA0000.jpg

*10లో 100 శాతం ఉత్తీర్ణత!* *ఎఫ్‌ఏ మార్కుల ప్రామాణికమే కారణం* *వాటిల్లో అందరికీ కనీస మార్కులు వస్తాయి* *వాటి ప్రకారమే సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు* ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతిలో ఈసారి దాదాపు 100 శాతం ఉత్తీర్ణత దక్కనుంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ) పరీక్షల్లో కనీస మార్కులు కూడా సాధించని వారు అత్యంత అరుదుగా ఉండటమే కారణమని అధికార, ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. నాలుగు ఎఫ్‌ఏలను రాయకుంటే తప్ప ఏ ఒక్క ఎఫ్‌ఏ రాసినా పాస్‌ కావడం గ్యారంటీ అని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. గత ఏడాది సప్లిమెంటరీ పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉత్తీర్ణత శాతం 98. సమీప భవిష్యత్తులో కూడా కరోనా వైరస్‌ తగ్గుతుందని కచ్చితంగా చెప్పలేమని, ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ జవాబుపత్రాల మూల్యాంకనం లాంటి ప్రక్రియలతో ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌తోపాటు బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాలు ఆలస్యమవుతాయని భావించి ప్రభుత్వం అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించిందని అధికారులు పేర్కొంటున్నారు. *హిందీలో 4… మిగిలిన సబ్జెక్టుల్లో 7 వస్తే పాసైనట్లే* ఎఫ్‌ఏలో 20కి 4 మార్కులు వచ్చినట్లయితే హిందీలో పాసైనట్లే. ఎందుకంటే హిందీలో 100కి 20 మార్కులు, మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో 35 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తారు. ఎఫ్‌ఏ పరీక్షలు 20 మార్కులకు నిర్వహిస్తారు. అంటే అప్పుడు హిందీలో 4 మార్కులు వస్తే 100కి 20 వస్తాయి. మిగిలిన సబ్జెక్టుల్లో 20కి 7 మార్కులు వస్తే అప్పుడు 35 మార్కులు దక్కుతాయి. సాధారణంగా చదువులో ఎంత వెనకబడిన విద్యార్థికైనా కనీస మార్కులు వేస్తారు. అంటే అన్ని ఎఫ్‌ఏ పరీక్షలు రాయని వారు మాత్రమే తప్పుతారు. *అంతర్గత మార్కులంటే?* పదో తరగతిలో ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)లు నాలుగు నిర్వహిస్తారు. వాటిని ఎఫ్‌ఏ-1, 2, 3, 4గా పిలుస్తారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. ఒక్కో దానికి 30-42 రోజుల సిలబస్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ పరీక్షలు జరుపుతారు. వాటిల్లో వచ్చిన మార్కులనే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకోనున్నారు. * ఒక్కో పరీక్షను 20 మార్కులకు నిర్వహించి తదుపరి 5 మార్కులకు కుదిస్తారు. ఆ రాత పరీక్షతో పాటు ప్రాజెక్టు వర్క్‌కు 5 మార్కులు, నోట్‌బుక్‌(రాత పని)కి 5 మార్కులుంటాయి. ఇంకా తరగతి గది స్పందనకు 5 మార్కులుంటాయి.. అలా 5+5+5+5 ….మొత్తం 20 మార్కులకు ఒక ఎఫ్‌ఏ నిర్వహిస్తారు. * సంవత్సరంలో 4 ఎఫ్‌ఏలు నిర్వహిస్తారు. అంటే 20+20+20+20= 80 మార్కులు. వాటిని సరాసరి చేసి 20 మార్కులకు కుదిస్తారు. ఆ ప్రకారం ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులకు ఎన్ని వచ్చాయో లెక్కించి వాటిని ఫిబ్రవరిలో ప్రభుత్వ పరీక్షల విభాగానికి (ఎస్‌ఎస్‌సీ బోర్డు) కు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. ప్రతి విద్యార్థి కనీసం ఎన్ని ఎఫ్‌ఏలు రాయాలన్న నిబంధన లేకున్నా రెండు కంటే తక్కువ రాసే వారు చాలా అరుదు. అప్పుడు ఆ రెండింటి సగటు తీసుకుంటారు. అంతకు ముందే ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ముగ్గురి బృందం అన్ని ప్రైవేట్‌ పాఠశాలలను తనిఖీ చేసి… విద్యార్థులను పరిశీలించి… యాజమాన్యాలు సక్రమంగానే అంతర్గత మార్కులు ఇచ్చాయా? లేదా ఇష్టమొచ్చినట్లు వేశారా? అని పరిశీలిస్తారు. అందుకే ఎఫ్‌ఏ పరీక్షల మార్కులనే ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. *ఇప్పుడు మార్కులు ఎలా లెక్కిస్తారంటే?* ఒక్కో సబ్జెక్టులో ఎఫ్‌ఏలో వచ్చిన మార్కులను(20కి) 100కి లెక్కిస్తారు. వాటిని ఇప్పుడు ఆ సబ్జెక్టులో వచ్చిన మొత్తం మార్కులుగా పరిగణిస్తారు. ఉదాహరణకు తెలుగులో ఎఫ్‌ఏ పరీక్షల్లో 20కి 18 మార్కులు వస్తే…దాన్ని 100కి లెక్కిస్తారు. అంటే 18్ల5=90 మార్కులు వచ్చినట్లుగా పరిగణిస్తారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights