65 లక్షల ఎకరాల్లో పత్తి

IMG-20200524-WA0043.jpg

*65 లక్షల ఎకరాల్లో పత్తి!* *కంది సాగు విస్తీర్ణం 76.83% పెంపు* *మొత్తం 1.23 కోట్ల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయా* *వానా కాలం సీజన్‌ సాగు విస్తీర్ణాలపై వ్యవసాయశాఖ నివేదిక* ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ వానా కాలం సీజన్‌లో పత్తి, కంది పంటల సాగు గణనీయంగా పెరగనుంది. నియంత్రిత పద్ధతిలో ఏ జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయించాలనే లెక్కలను వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ సమీక్ష జరిపి నిర్ణయించిన మేరకు రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు పంటలపై దృష్టిపెట్టారు. మొత్తం కోటీ 23 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయాచిక్కుడు సాగు చేయించాలనే అంచనాతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మళ్లించే నీటిని బట్టి ఈ నివేదిక తయారు చేశారు. దీని ప్రకారం.. పత్తి సాగు విస్తీర్ణం దాదాపు 10.5 లక్షల ఎకరాలు పెరిగి 65 లక్షల ఎకరాలకు చేరవచ్చని అంచనా. కంది సాగు విస్తీర్ణం 76.83 శాతం పెరగనుంది. వరి పంట దాదాపు గతేడాది స్థాయిలోనే సాగు కానుంది. మొక్కజొన్న సాగు పూర్తిగా మానేయాలని, సోయాచిక్కుడు పంటను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది సోయా 4.26 లక్షల ఎకరాల్లో సాగవగా, ఈసారి 4.08 లక్షల ఎకరాలకే పరిమితం చేయనున్నారు. *25 లక్షల ఎకరాల్లో సన్నరకం విత్తనాలే* * వరిలో తప్పనిసరిగా 25 లక్షల ఎకరాల్లో సన్నరకం విత్తనాలే వేయించాలని నిర్ణయించారు. ఈ సన్న రకాల్లోనూ 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా రకం సాగుకు విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. * పత్తి విత్తనాలు ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పున మొత్తం 1.33 కోట్లు అవసరం. వీటిని గ్రామాలకు పంపాలని విత్తన కంపెనీలకు వ్యవసాయశాఖ తెలిపింది. పత్తి విత్తనాలన్నీ ప్రైవేటు కంపెనీలే రైతులకు విక్రయిస్తాయి. * సోయా సాగుకు అవసరమైనన్ని విత్తనాలు ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌) తెలిపింది. * జొన్న పంట గతేడాది 1.47 లక్షల ఎకరాల్లో వేయగా, ఈ సీజన్‌లో మరో 13 వేల ఎకరాలు అదనంగా సాగు చేయించాలని నిర్ణయించారు. * ప్రభుత్వం సాగు వద్దని చెప్పిన మొక్కజొన్న విత్తనాలను మార్కెట్‌లో అమ్మకుండా నియంత్రిస్తున్నారు. *సాగునీటి ప్రాజెక్టుల కింద పెరిగిన ఆయకట్టు* సాగునీటి ప్రాజెక్టుల కింద గత రెండు సంవత్సరాలుగా సాగవుతున్న ఆయకట్టు పెరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, వరంగల్‌ జిల్లాలో దేవాదుల తదితర ప్రాజెక్టుల కింద చెరువులను నింపి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ పథకాల కింద డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే చెరువుల కింద ఆయకట్టుతో పాటు వర్షాధారం మీద ఆధారపడిన ఆయకట్టుకు ప్రాజెక్టుల ద్వారా నీరందుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 60 టీఎంసీలు మళ్లించారు. ఈ సంవత్సరం ఎక్కువ నీటిని మళ్లించనున్నారు. *ప్రధాన పంటల సాగులో మొదటి 5 స్థానాల్లో ఉండే జిల్లాలు* *వరి* : నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాల *పత్తి* : నల్గొండ, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కుమురంభీం *కంది:* వికారాబాద్‌, నారాయణపేట, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి *సోయాబీన్‌* : నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, సంగారెడ్డి


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights