భక్తి పేరుతో సమర్పించిన కిరీటం.. ఆలయ కమిటీ చేతిలో తాకట్టు!

కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వెలుగులోకి వచ్చిన ఘటన భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. స్వామివారిపై అపారమైన భక్తితో ఓ వృద్ధ దంపతులు సమర్పించిన విలువైన బంగారు కిరీటాన్ని ఆలయ కమిటీ సభ్యులు తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వివరాల ప్రకారం, మాటూరి సుబ్బారావు, లక్ష్మీకుమారి అనే వృద్ధ దంపతులు తమ భక్తి సూచకంగా 461 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా కిరీటాన్ని తయారు చేయించారు. ఈ కిరీటాన్ని 2025 జనవరిలో ఆలయ అధికారుల సమక్షంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించారు. అప్పట్లో ఈ కిరీటం తయారీకి సుమారు రూ.70 లక్షలు ఖర్చు కాగా, ప్రస్తుతం బంగారం ధరల ప్రకారం దాని విలువ దాదాపు రూ.కోటికి చేరిందని తెలుస్తోంది.
భక్తులు ఎంతో విశ్వాసంతో సమర్పించిన ఈ కిరీటాన్ని ఆలయంలో భద్రంగా ఉంచి ప్రత్యేక సందర్భాల్లో స్వామివారికి అలంకరిస్తారని దాతలు భావించారు. అయితే కొంతకాలంగా ఆ కిరీటాన్ని స్వామివారికి అలంకరించకపోవడం వృద్ధ దంపతుల్లో అనుమానాలకు దారితీసింది. పలుమార్లు ఆలయ అధికారులను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో వారు స్వయంగా ఆరా తీశారు.
ఈ క్రమంలో షాకింగ్ విషయం బయటపడింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు మోహనరావుతో పాటు మరికొంత మంది సభ్యులు కలిసి ఆ బంగారు కిరీటాన్ని గుడివాడలోని ఓ మార్వాడీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టినట్లు సమాచారం బయటకు వచ్చింది. దాదాపు రూ.కోటి విలువ చేసే కిరీటాన్ని కేవలం రూ.38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన దాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
దాత సుబ్బారావు మాట్లాడుతూ, స్వామివారిపై భక్తితో అందరి సమక్షంలోనే కిరీటాన్ని సమర్పించామని తెలిపారు. కానీ ఇటీవల ఆ కిరీటం కనిపించకపోవడంతో అనుమానం వచ్చిందని, ఆరా తీస్తే తాకట్టు పెట్టిన విషయం తెలిసిందని వెల్లడించారు. వెంటనే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే పోలీసులు కోర్టును ఆశ్రయించాలని సూచించారని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఆ కిరీటాన్ని తిరిగి తమకు అప్పగిస్తే, సరైన నిర్వహణ ఉన్న మరో ఆలయంలో స్వామివారికి సమర్పిస్తామని సుబ్బారావు అన్నారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి పేరుతో వచ్చిన విరాళాలను కాపాడాల్సిన వారు ఇలా వ్యవహరించడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై భక్తులు, స్థానిక హిందూ సంఘాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆలయ ఆస్తుల భద్రతపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయాల నిర్వహణ, విరాళాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
పోలీసులు ప్రస్తుతం ఫిర్యాదు ఆధారంగా కేసును పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాకట్టు పెట్టిన కిరీటం ఎక్కడ ఉంది, దానిని ఎవరి అనుమతితో తీసుకెళ్లారు, అందులో మరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై విచారణ జరగనుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
