హమ్మయ్య..! సినీప్రముఖులు బయటపడ్డారు..!

Spread the love

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు బయటపడ్డారు. ఈ కేసులో వాళ్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. డ్రగ్స్ వాడిన సినీ ప్రముఖులందర్నీ బాధితులుగా చార్జిషీట్‌లో పేర్కొంది ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌. నాలుగేళ్ల క్రితం నానా హంగామా చేసిన సిట్… ఇప్పుడు కేసులో అందరూ బాధితులే స్పష్టం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

డ్రగ్స్‌ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల్ని ఎక్సైజ్‌ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌ ప్రశ్నించింది. రోజుకొకర్ని తమ కార్యాలయానికి పిలిపించుకుని గంటల తరబడి ప్రశ్నించింది సిట్‌.

ఎక్సైజ్‌ శాఖ చేసిన హంగామా సినీ పరిశ్రమలో ఓ రేంజ్‌లో కలకలం రేపింది. ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుంది..? ఇంకా ఎవరెవరికి ఎక్సైజ్‌ శాఖ నోటీసులిస్తుందో..? ఎవరెవర్ని అరెస్ట్‌ చేస్తారో అనే ఆందోళన వ్యక్తమైంది. ఎక్సైజ్‌ శాఖ హంగామాపై ఆఖరికి ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. ఈ ఎపిసోడ్‌పై… మత్తు వదలరా అంటూ ఓ సినిమా కూడా తీశారు.

హైదరబాద్ నగరంలో డ్రగ్స్‌ అమ్ముతున్న వాళ్లను తరచూ పోలీసులకు దొరికిపోతుంటారు. బొయిన్‌పల్లికి చెందిన ఓ డ్రగ్స్‌ విక్రేతను పట్టుకున్నప్పుడు అతని కాల్ డాటా ఆధారంగా సినీ ప్రముఖుల డ్రగ్స్‌ లింకులు బయటపడ్డాయి. నిందితుడి వాంగ్మూలంతో ఎక్సైజ్ అధికారులు… సినీ పరిశ్రమకు చెందిన వాళ్లకు సమన్లు జారీ చేస్తూ… ఒక్కొక్కర్నీ పిలిపించి ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంపై అప్పటి ఎక్సైజ్ అండ్ ఎన్ ఫొర్స్ మెంట్ డైరెక్టర్ గా వున్న అకూన్ సబర్వాల్ ప్రత్యేక శ్రద్ద కనబరిచారు.

ఒక నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు 12 మంది సినీ ప్రముఖుల్ని డ్రగ్స్‌ కేసులో చేర్చారు. డైలీ సీరియల్‌ తరహాలో రోజుల తరబడి విచారణ జరిపారు. విచారణకు హాజరైన వాళ్ల రక్త నమూనాలతో పాటు గోర్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు అధికారులు. ఎంత కాలంగా డ్రగ్స్‌ తీసుకుంటున్నారు… డ్రగ్స్‌ వాడుతున్నారా? లేక ఎవరికైనా డ్రగ్స్‌ సప్లై చేస్తున్నారా అని ఆరా తీశారు ఎక్సైజ్‌ అధికారులు.

డ్రగ్స్‌ వ్యవహారంపై నాలుగేళ్లు దర్యాప్తు చేసిన ఎక్సైజ్‌ శాఖ… చివరికి సినీ పరిశ్రమకు చెందిన వాళ్లందర్నీ బాధితులుగా తేల్చింది. ఇదే విషయాన్ని చార్జిషీట్‌లో చెప్పింది. చట్ట ప్రకారం డ్రగ్స్‌ తీసుకున్న వాళ్లను బాధితులుగానే పరిగణిస్తారు. ఎవరికైనా డ్రగ్స్‌ అందజేస్తేనే నిందితులుగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే… బాధితులను రోజుల తరబడి విచారించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు మాత్రం ఎక్సైజ్‌ శాఖ నుంచి సమాధానం లేదు.

డ్రగ్స్‌ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా సేకరించే ప్రయత్నం చేశాయి కొన్ని సంస్థలు. అయితే, వ్యక్తిగత సమాచారం కావడం వల్ల దీనిని బయటికి ఇవ్వలేమని స్పష్టం చేశారు ఎక్సైజ్ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *