ఎయిర్ ఇండియా ఫర్ సేల్: రూ. 22,863 కోట్ల రుణభారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం

Spread the love

జాతీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాలో తన వాటాలను పూర్తిగా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.

కొనుగోలుదారులు తమ ఆసక్తిని తెలియజేయాలని ప్రభుత్వం కోరింది.

కొనుగోలుదారులు సంస్థకు ఉన్న దాదాపు 22,863 కోట్ల రూపాయల రుణభారాన్ని కూడా మోయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

నిజానికి 2018లోనే ఎయిర్ ఇండియాలో కొంత వాటా విక్రయించే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ, కొనుగోలుదారులు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఈసారి మొత్తం 100 శాతం వాటా విక్రయించనున్నట్లు ప్రకటించింది.

నష్టాల్లో ఉన్న సంస్థలను వదిలించుకొని, మందగించిన ఆర్థిక వృద్ధిని మళ్ళీ గాడిలో పెట్టాలనే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అధిక ఇంధన ధరలు, పెరిగిపోయిన విమానాశ్రయ వినియోగ చార్జీలు, తక్కువ ధరలకే పనిచేసే సంస్థల నుంచి పోటీ, బలహీనపడిన రూపాయి విలువతో పాటు అధిక వడ్డీల భారం కూడా సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి కారణమని ఎయిర్ ఇండియా కొన్నేళ్లుగా చెబుతూ వస్తోంది.


ప్రభుత్వం ఏం ఆఫర్ చేస్తోంది?
ఎయిర్ ఇండియాలో వంద శాతం వాటా విక్రయిస్తామన్నది ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ప్రతిపాదన. 2018లో ప్రభుత్వం 76 శాతం వాటా మాత్రమే విక్రయిస్తామని చెప్పింది. దాంతో సంస్థను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు.

‘ఇది చాలా సానుకూల మార్పు. ప్రైవేటు వ్యక్తులను ఆకర్షించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది’ అని ఎయిర్ ఇండియా మాజీ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ బీబీసీతో చెప్పారు.

ఎయిర్ ఇండియా దగ్గర 146 విమానాలున్నాయి. వాటిలో 56 శాతం విమానాలు ఆ సంస్థ సొంతం. ఆ సంస్థ అధీనంలో అంతర్జాతీయ, డొమెస్టిక్ పార్కింగ్ స్లాట్‌లు కూడా ఉన్నాయి. కానీ, గత దశాబ్ద కాలంగా ఇతర సంస్థల నుంచి పోటీ కారణంగా ఎయిర్ ఇండియా నష్టాలను చవిచూసింది. దాదాపు రూ.52 వేల కోట్ల రూపాయల మేర బకాయిలు పేరుకుపోయాయి.

కానీ, కొనుగోలుదారులు రూ.22 వేల కోట్ల రూపాయల మేర అప్పుల భారం మాత్రమే మోయాల్సి ఉంటుంది. మిగతా అప్పును ఏం చేస్తుందన్నది ప్రభుత్వం చెప్పలేదు.

”కొనుగోలుదారులకు ఇది పెద్ద సవాలుగా ఉంటుంది. దాదాపు 70 శాతం విమానాలకు 8 నుంచి పదేళ్ల పాటు నెలవారీ వాయిదాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దానికి తోడు సంస్థ ప్రక్షాళన కోసం తొలిదశలో భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా పెట్టాల్సి ఉంటుంది” అని ఎస్బీఐకాప్ సెక్యురిటీస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ మహంతేష్ శబారడ్ తెలిపారు.

14 వేల పైచిలుకు ఎయిర్ ఇండియా సిబ్బందిని క్రమబద్ధీకరించడం కూడా సవాలేనని నిపుణులు అంటున్నారు.

కోబ్ బ్రయాంట్: హెలీకాప్టర్ ప్రమాదంలో బాస్కెట్ బాల్ సూపర్ స్టార్ దుర్మరణం.. ఏడాదికి రూ.5,500 కోట్ల వేతనంతో రికార్డు
కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు

ఇదీ ఎయిర్ ఇండియా చరిత్ర
1932: జేఆర్డీ టాటా అధీనంలోని టాటా సన్స్ గ్రూప్ టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించింది.

1946: టాటా ఎయిర్‌లైన్స్ పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా మారింది. దానికి ఎయిర్ ఇండియా అని పేరు పెట్టారు.

1948: సంస్థలో 49 శాతం వాటాను ప్రభుత్వం దక్కించుకుంది.

1953: ఎయిర్ ఇండియాను ప్రభుత్వం జాతీయం చేసింది.

2007: ఎయిర్ ఇండియా.. ప్రభుత్వ అధీనంలోని ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనమైంది.

2007-08: ఎయిర్ ఇండియా సంస్థ రూ. 33 కోట్ల నష్టాన్ని చూపించింది.

2018: 76 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది.

2019: ఎయిర్ ఇండియా రూ. 12,800 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *