ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే నిధి క్యాన్సర్ అనేది తన జీవితంగా మారకూడదని, ఎలాగైనా దాన్నుంచి బయటపడాలని దృఢంగా నిర్ణయించుకున్నారు.
నిధి కపూర్ ఆ మాట చాలా మామూలుగా చెబుతారు. 40 ఏళ్ల వయసులో తనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందని నిధికి తెలిసింది.
అది ఫస్ట్ స్టేజ్ అని పరీక్షల్లో తెలియగానే, నేను దానితో ఎలా పోరాడాలో ఆలోచించాను అని ఆమె చెప్పారు.
భర్త, కుటుంబం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆమె చెప్పారు. కానీ, తన తోడికోడలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పినపుడు మాత్రం ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.
“మా తోడికోడలు గర్భంతో ఉన్నప్పుడు, ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. అది లాస్ట్ స్టేజిలో ఉంది. డెలివరీ తర్వాత ఆమె చనిపోయింది” అన్నారు.
అప్పటికి నిధి తోడికోడలు వయసు 29 ఏళ్లు. చిన్న వయసులో క్యాన్సర్ వచ్చిందనే వార్తలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి, కానీ ఇందులో నిజమెంత?
యువతలో క్యాన్సర్
గత పదేళ్లలో క్యాన్సర్ కేసులు 28 శాతం పెరిగాయి. ఈ వ్యాధి వల్ల సంభవించే మరణాలు 20 శాతం పెరిగాయి. ‘మెడికల్ జర్నల్ ఆఫ్ ఆంకాలజీ’ 1990 నుంచి 2016 మధ్య చేసిన ఒక సర్వేలో ఈ విషయం తెలిసింది.
ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న రెండో వ్యాధి క్యాన్సర్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
క్యాన్సర్ పెద్ద వయసు వారిలో వచ్చే వ్యాధి అని డాక్టర్లు చెబుతున్నారు. కానీ చిన్న వయసు వారికి కూడా క్యాన్సర్ వచ్చిన కేసులు బయటపడుతున్నాయి.
“వీటిలో 40 శాతం కేసులు టొబాకో రిలేటెడ్ క్యాన్సర్ (టీఆర్సీ) అంటే పొగాకు సేవనం వల్ల వస్తున్నాయి. ఇప్పుడు 20-25 ఏళ్ల యువతలో కూడా ఈ వ్యాధి కనిపిస్తోంది” అని ఎయిమ్స్‌లో సర్జికల్ ఆంకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎస్వీఎస్ దేవ్ చెప్పారు.
లైఫ్‌స్టైల్ కారణం…
పొగాకు తీసుకునేవారికి, దానిని ప్రారంభించిన 10-20 ఏళ్ల తర్వాత తమకు క్యాన్సర్ వచ్చినట్లు తెలుస్తుంది. మా దగ్గరకు వచ్చే గ్రామీణ యువకులు స్మోక్లెస్ టొబాకో ఉపయోగిస్తున్నారు. అంటే పొగాకు, ఖైనీ, గుట్కా లాంటివి.
“అది చేసే నష్టం గురించి తెలీని ఈ యువకులు చాలా చిన్న వయసులోనే అవి తీసుకోవడం మొదలుపెడతారు. అలాంటి 22-25 ఏళ్ల యువకులు క్యాన్సర్‌తో మా దగ్గరకు చికిత్స కోసం వస్తున్నారు” అని డాక్టర్ ఎస్వీఎస్ దేవ్ చెప్పారు.
“ఎయిమ్స్‌కు వచ్చే హెడ్ అండ్ నెక్, కొలోన్, బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల్లో 30 శాతం రోగులు 35 ఏళ్ల లోపువారే ఉన్నారు” అని డాక్టర్ దేవ్ చెప్పారు.
పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించినది అని ముంబయి టాటా మెమోరియల్ సెంటర్లో సెంటర్ ఫర్ క్యాన్సర్ ఎపిడిమియాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ దీక్షిత్ చెప్పారు.
“యూరప్, అమెరికాలో పొగాకు సేవనం గురించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్ కేసులు తగ్గాయి” అని ఆయన చెప్పారు.
పొగాకు సేవనం వల్ల చాలామందికి ఓరల్, పాంక్రియాటిక్, సర్విక్స్, ఓవరీ, లంగ్, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోందని వైద్యులు, ప్రభుత్వాలు, మీడియా దీనిపై తీవ్రంగా పనిచేస్తే క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు అని డాక్టర్ దేవ్ చెప్పారు.
పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన వ్యాధి
క్యాన్సర్ వల్ల సంభవించే మూడో వంతు మరణాలకు శారీరకంగా పొడవుకు తగిన బరువు కన్నా ఎక్కువగా ఉండడం, పండ్లు, కూరగాయలు తినడం తగ్గించడం, వ్యాయామం చేయకపోవడం, పొగాకు, మద్యం సేవించడమే కారణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
భారత్‌లో 15.86 లక్షల క్యాన్సర్ కేసులు ఉన్నాయని దేశంలో పెరిగిన క్యాన్సర్ కేసుల గురించి 2018లో లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ రాణే చెప్పారు. వివిధ ఆరోగ్య కేంద్రాలలో రోగులకు పరీక్షలు, వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
చికిత్సలో సర్జరీ, రేడియోగ్రఫీ, కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ అంటే నొప్పి తగ్గే సదుపాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
దేశంలో లైఫ్ స్టైల్, ఊబకాయం, సగటు వయసు పెరగడం, వైద్య పరీక్షా సౌకర్యాలు కూడా పెరగడం అనేది భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఒక కారణం అని డాక్టర్లు చెబుతున్నారు.
“స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత్‌లో సగటు వయసు 40-45 ఉండేది. ఇప్పుడు అది పెరిగి 65-70 అయ్యింది. మొదట్లో భారత్‌లో పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లకు సంబంధించిన వ్యాధులు కనిపించేవి. వాటిపై చాలా వరకూ అదుపు సాధించాం. జనాభా పెరగడంతోపాటు క్యాన్సర్ కేసులను గుర్తించే పరీక్షల సదుపాయాలు కూడా పెరిగాయి” అని డాక్టర్లు చెబుతున్నారు.
భారత్‌లో క్యాన్సర్ చరిత్ర
భారతదేశంలో క్యాన్సర్ లాంటి వ్యాధి, దాని చికిత్స గురించి ఆయుర్వేదం, సిద్ధ, ప్రాచీన రాతప్రతుల్లో కూడా ప్రస్తావన కనిపిస్తుంది.
‘జర్నల్ ఆఫ్ గ్లోబల్ ఆంకాలజీ’ ప్రకారం భారత్‌లోని మధ్యయుగ సాహిత్యంలో క్యాన్సర్ గురించి ప్రస్తావన చాలా తక్కువ కనిపిస్తుంది. కానీ క్యాన్సర్ కేసుల గురించి 17వ శతాబ్దం నుంచి రిపోర్టులు రావడం మొదలైంది.
1860 నుంచి 1910 మధ్య భారత్‌లో డాక్టర్లు చేసిన రోగ నిర్ధారణ పరీక్షలను, క్యాన్సర్ కేసులపై వరుస నివేదికలను ప్రచురించారు.
మహిళల్లో క్యాన్సర్
భారత మహిళలల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు బయటపడుతున్నాయని ‘ది గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజ్ స్టడీ’ (1990-2016) వెల్లడించింది.
ఈ అధ్యయనం ప్రకారం.. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, కొలోన్ అండ్ రెక్టల్, లిప్ అండ్ కావిటీ కాన్సర్ కేసులు అత్యధికంగా వెలుగులోకి వచ్చాయి.
గ్రామాలు, పట్టణాలను పోలిస్తే, గ్రామాల్లో సర్వైకల్, పట్టణాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ మొత్తం భారతదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది.
దానికి ప్రధాన కారణం ఆలస్యంగా వివాహాలు కావడం, గర్భధారణ ఆలస్యం కావడం, పిల్లలకు పాలు పట్టకపోవడం, పెరుగుతున్న ఒత్తిడి, లైఫ్ స్టైల్, ఊబకాయమే అని దిల్లీ రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన లంగ్ అండ్ బ్రెస్ట్ రేడియేషన్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ కుందన్ సింగ్ చుఫాల్ చెప్పారు.
భారత్‌లో ఊబకాయం, ముఖ్యంగా పొట్టలో కొవ్వు చేరడం వల్ల గాల్ బ్లాడర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్ కేసులు వస్తున్నాయని డాక్టర్ రాజేష్ దీక్షిత్ చెప్పారు.
కాలుష్యం కారణంగా..
గత ఏడాది దిల్లీలోని గంగారామ్ ఆస్పత్రి చెస్ట్ సర్జన్, లంగ్ కేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ కుమార్ ఒక 28 ఏళ్ల మహిళకు లంగ్ క్యాన్సర్ ఉందని చెప్పారు. ఆమె ఎప్పుడూ పొగతాగకపోయినా ఆమెకు నాలుగో స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు.
అది దిల్లీలోని కాలుష్యం వల్ల వచ్చుంటుందా, అనే ప్రశ్నకు.. “ఆ మహిళ కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరూ ఎప్పుడూ పొగతాగలేదు. అలాంటప్పుడు ఆమెకు అది వచ్చే అవకాశమే లేదు. అది, దిల్లీ కాలుష్యం వల్లే వచ్చుండవచ్చు అనే దానిని అంగీకరించాల్సి ఉంటుంది” అని ఆయన చెప్పారు.
కాలుష్యం కూడా లంగ్ క్యాన్సర్‌కు ఒక కారణం అని ఎయిమ్స్ డాక్టర్ ఎస్వీఎస్ దేవ్ కూడా భావిస్తున్నారు.
ఆర్థికవ్యవస్థపై ప్రభావం
లాన్సెట్ జర్నల్ ప్రకారం 2035 వరకూ క్యాన్సర్ కేసులు పెరుగుతాయి. అవి 10 లక్షల నుంచి పెరిగి 17 లక్షలకు చేరతాయి. క్యాన్సర్ వల్ల సంభవించే మరణాల సంఖ్య కూడా పెరిగి 12 లక్షలకు చేరతాయి.
అటు, జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ ప్రకారం భారత్‌లో 18 లక్షల మంది క్యాన్సర్ రోగులకు కేవలం 1600 మంది నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 1125 మంది క్యాన్సర్ రోగులకు ఒక క్యాన్సర్ నిపుణుడు ఉన్నారు.
ఈ సెల్ఫీతో కేన్సర్‌ను తరిమికొట్టొచ్చు
క్యాన్సర్ వల్ల ఆర్థికవ్యవస్థపై రెండు రకాల ప్రభావాలు ఉంటాయని- ఒకటి రోగుల కుటుంబాలపై, రెండోది భారత ఆరోగ్య బడ్జెట్‌పై అని నవ్య వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ ఎం రాజన్ చెప్పారు.
ఈ ప్రభావం తగ్గించడానికి ఒక నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏర్పాటు చేశారు. ఎన్సీజీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్పత్రుల ఒక గ్రూప్. నిపుణుల అభిప్రాయాలు, చికిత్స విధానాలను రోగులు, వారి కుటుంబం చెంతకే చేర్చేందుకే నవ్యను స్థాపించారు.
“కుటుంబంలో ఒక సభ్యుడికి క్యాన్సర్ వచ్చినా, అతడి చికిత్స కోసం 40-50 శాతం మంది అప్పులు తీసుకుంటారు, లేదంటే ఇళ్లు, ఆస్తులు అమ్మేస్తారని ఎన్నో అధ్యయనాల ద్వారా తేలింది” అని డాక్టర్ నరేష్ రాం రాజన్ చెప్పారు.
లాన్సెట్‌లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం సుమారు మూడు నుంచి ఐదు శాతం మంది క్యాన్సర్ చికిత్స వల్ల దారిద్ర్య రేఖకు దిగువకు చేరుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్’, ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ జాబితాలో క్యాన్సర్ వ్యాధిని కూడా చేర్చడం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని డాక్టర్లు భావిస్తున్నారు.
‘ఆయుష్మాన్ యోజన’ను ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. ఇందులో క్యాన్సర్ చికిత్సకు కూడా ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం ప్రకారం బాధితుడి వైద్యం కోసం ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించే విధంగా నిబంధనలు రూపొందించారు.
రొమ్ము క్యాన్సర్‌ను సూచించే 12 లక్షణాలు
పేదలు చికిత్స కోసం పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం లేకుండా, వ్యాధి గురించి తెలీగానే వారికి చికిత్స ప్రారంభించేలా ప్రభుత్వం తరఫున ఈ నిబంధనలు రూపొందించారు అని డాక్టర్ నరేష్ ఎం రాజన్ చెప్పారు.
దీనికోసమే నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు. ఈ గ్రిడ్‌లో 170 క్యాన్సర్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లు ప్రత్యేకంగా భారత్‌లోని క్యాన్సర్ రోగుల కోసం మార్గదర్శకాలు రూపొందించారు.
అందులో, రోగులు భారత్‌లో ఏ మూల ఉన్నా, వారికి ఎలాంటి క్యాన్సర్ ఉన్నా, మీరు ఈ టెస్ట్ చేయించుకోవాలి, ఇలాంటి చికిత్స తీసుకోవాలి అనేవి వివరంగా చెప్పారు.
వీటితోపాటు గత మూడు నాలుగు ఏళ్లలో క్యాన్సర్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో రోగి, డాక్టర్ ఎక్కడ ఉన్నా వారికి క్యాన్సర్ గురించి మొత్తం సమాచారం ఇచ్చి చికిత్స జరిగేలా చేస్తారు. వారికి నగరాలలో ఉన్న పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం రాదు. ఈ గ్రిడ్‌లో ఆయుష్మాన్ యోజనను కూడా జోడించారు. అంటే, ఏ రోగులు చికిత్స కోసం వస్తారో, వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం కూడా అందుతుంది.
“ఆయుష్మాన్ యోజన ద్వారా క్యాన్సర్ రోగులకు లబ్ధి చేకూరుతుంది. అంతకు ముందు క్యాన్సర్ మందుల ఖరీదు చాలా ఎక్కువని కూడా చర్చ జరిగింది. దాంతో, ప్రభుత్వ నేషనల్ ఫార్మసూటికల్ ప్రైసింగ్ అథారిటీ క్యాన్సర్ రోగులకు ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతం వరకూ పరిమితం చేసింది” అని డాక్టర్ ఎస్వీఎస్ దేవ్ కూడా చెప్పారు.
Source:https://www.bbc.com/telugu/india-51358838