ప్రతీ ఒక్కరి జీవితానికి అమ్మ ప్రేమ అనేది అంతులేనిది..వెల కట్టలేనిది. మనల్ని నవ మాసాలు మోసి కనే అమ్మ ఈ భూమాత కంటే గొప్పదని చెప్పాలి. పుట్టిన ప్రతీ బిడ్డ కళ్ళు తెరచి చూసే మొట్ట మొదటి వ్యక్తి అమ్మ. అంతేకాదు ప్రతీ బిడ్డ మొదటిగా పలికేది అమ్మ అన్న మాటనే. బిడ్డ కోసం కన్న తల్లి పడే కష్టం, శ్రమ.. ప్రపంచంలో ఇంకొకరు పడరు అంటే అతిశయోక్తి కాదు. ధనికులకైనా, నిరుపేదలకైనా స్థాయి లేనిది, తారతమ్యం ఉండనిది తల్లి ప్రేమ ఒక్కటే.
సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ నేను పలానా అని చెప్పుకునే ముందు నేను ఒక తల్లికి కొడుకుని అని గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడే మనం తల్లి రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాము. ఈ విషయంలో మెగా సోదరులు ఎంతమందికో ఆదర్శంగా నిలిస్తున్నారు.
మెగాస్టార్ గా చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ గా నాగ బాబు, అలాగే పవర్ స్టార్ ఇమేజ్, జనసేనాని అయిన పవన్ కళ్యాణ్ లకి తల్లి అంజనా దేవి అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేము. ఈ ముగ్గురికి అమ్మ అంజనాదేవి ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు. అంతేకాదు అమ్మ ఆశీర్వాదము లేదినే ఏ పని మొదలు పెట్టరంటే అర్థమవుతుంది ఈ మెగా సోదరులకి అమ్మ అంటే ఎంత ప్రేమో.
ఇండస్ట్రీలో స్టార్స్ అయిన ఈ ముగ్గురు ఇప్పటికి అమ్మ దగ్గరికి చేరుకుంటే పసి పిల్లలైపోతారు. స్టార్స్ అన్న మాట ..మాకు పెళ్ళై పిల్లలున్నారన్న విషయం తల్లి ని చూడగానే ఏమాత్రం గుర్తు రావంటే ఎంత చిన్న తనానికి దిగిపోతారో అర్థం చేసుకోవచ్చు. ఇక అంజనాదేవి గారు తన కొడుకులు పెద్ద స్టార్ అన్న మాటని దరి దాపుల్లోకి కూడా చేరనివ్వరు. ముందు నా బిడ్డలు .. ఆ తర్వాతే హీరోలైనా, స్టార్స్ అయినా.. అన్న విధంగా అక్కున చేర్చుకొని లాలిస్తారు. చెప్పాలంటే ఈ మెగా సోదరులు ఎంతో అదృష్ఠవంతులు.
ముఖ్యంగా చిన్న కొడుకు పవన్ కళ్యాణ్ తన అమ్మ అంజనా దేవిపై ఉన్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో బయట పెట్టారు. ఆయనకు తొలి దైవం అమ్మనే అని ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. అంతేకాదు ‘ఒడిలో పాపై ఒదిగా నేనే’ అన్నపాటను తల్లి కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేయించి మదర్స్ డే రోజున గిఫ్ట్‌గా ఇవ్వడం గొప్ప విషయం.
ఇక అంజనాదేవి గారికి పవన్ అంటే అమితమైన ప్రేమ. ఏ క్షణాన వచ్చిన గుండెలకి హత్తుకొని మనసారా తన ప్రేమని చాటుకుంటారు. అంతేకాదు జనసేన పార్టి తరపున కొడుకు చేస్తున్న సేవా కార్యక్రమాలకి తల్లి అంజనాదేవి గారు విరాళంగా తన వద్ద ఉన్న డబ్బుని ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఇక చిరంజీవి సోదరులిద్దరిని ఆయన భార్య సురేఖ గారు తల్లిలాగే చూసుకోవడం కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. వదిన దగ్గర ఇప్పటికి చిన్నపిల్లాడిలా ఒదిగి పోతుంటారు.