కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన

nirmala
Spread the love

బడుగులకు గొడుగు

రూ. 3.16 లక్షల కోట్లతో కేంద్రం మరిన్ని వరాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన

ఈనాడు: లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం మరిన్ని వరాలు ప్రకటించింది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం రెండో విడతలో భాగంగా వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేయనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మొత్తం 9 అంశాలను ఈ ప్యాకేజీలో పొందుపరిచారు. వలస కార్మికుల కోసం 3, ముద్రా-శిశు రుణాల కోసం 1, వీధి వ్యాపారుల కోసం 1, గృహ నిర్మాణం కోసం 1, ఉపాధి కల్పన కోసం 1, చిన్న, సన్నకారు రైతుల కోసం 2 ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ప్రకటించిన రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీతో కలుపుకుంటే ఈ రెండురోజుల్లో ప్రకటించిన ప్యాకేజీ మొత్తం విలువ రూ.9,10,250 కోట్లవుతుంది.

రూ.11 వేల కోట్ల నుంచి కూలీలకు భోజనం ఖర్చులు

ప్రస్తుత కష్టకాలంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను గమనించి వారికి తక్షణ ప్రయోజనం కలిగించే చర్యలను సీతారామన్‌ ప్రకటించారు. ప్రస్తుతం సొంతూళ్లకు నడిచిపోతున్న వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ వండిన భోజనం పెట్టాలని సూచించారు.

రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ.11వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. ఆ నిధులను ఉపయోగించుకొని కార్మికులకు అన్నం పెట్టొచ్చని పేర్కొన్నారు. వట్టి బియ్యం ఇస్తే తినే పరిస్థితి ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో నడిచి వెళ్లే పేదలకు వండిన భోజనం పెట్టాలని పిలుపునిచ్చారు.

కార్డులు లేకున్నా ఉచిత రేషన్‌

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 8 కోట్ల మంది వలస కార్మికులకు వచ్చే రెండు నెలలపాటు ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం/గోధుమలు, రేషన్‌కార్డుకు ఒక కేజీ చొప్పున పప్పు దినుసులు పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లు ఖర్చుపెట్టనుంది. కూలీలను గుర్తించి అమలు చేసే బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్రప్రభుత్వాలదే. రేషన్‌కార్డులు లేకపోయినా వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.

ముద్ర- శిశు రుణాలకు వడ్డీ రాయితీ

లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు జరగక ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి వారు తీసుకున్న ముద్ర-శిశు రుణాలపై వచ్చే 12 నెలలపాటు 2% వడ్డీ రాయితీ కల్పిస్తారు. దీనివల్ల లబ్ధిదారులకు రూ.1,500 కోట్ల ప్రయోజనం కలుగనుంది.

అందుబాటు అద్దెల్లో గృహ సముదాయాలు

వలస కార్మికులు, పట్టణ పేదలకు అందుబాటు అద్దెల్లో ఇళ్లను అందించేందుకు ప్రధామంత్రి ఆవాస్‌ యోజన కింద గృహ సముదాయాలను నిర్మించే పథకాన్ని అమలు చేస్తారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని నిర్మిస్తారు. ప్రైవేటు సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులు తమ సొంత స్థలాల్లో ప్రభుత్వ రాయితీలు ఉపయోగించుకుని ఇళ్లను నిర్మించి పేదలకు అద్దెలకు ఇవ్వొచ్చు. ఇందుకు సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఇందులో ప్రభుత్వపరంగా పెట్టుబడి ఏమీ ఉండదు. ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తే ప్రభుత్వం ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తుంది.

‘కంపా’ నిధులతో గిరిజనులకు ఉపాధి

అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకు రూ.6వేల కోట్ల ప్రత్యామ్నాయ అటవీ పెంపకం పథకం (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ- కంపా) నిధులతో ఉపాధి కల్పిస్తారు. పట్టణ ప్రాంతాల్లోనూ దీని కింద పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.

రైతులకు రూ.30 వేల కోట్లు

చిన్న, సన్నకారు రైతులకు నాబార్డు ద్వారా రూ.30వేల కోట్ల అత్యవసర మూలధన నిధి సమకూరుస్తారు. నాబార్డు ఇప్పటికే సమకూర్చిన రూ.90వేల కోట్లకు ఇది అదనం. ఈ మొత్తం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందజేస్తారు. ప్రస్తుత రబీలో 3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

2.5 కోట్లమంది రైతులు, మత్స్యకారులు, పశుపాలకులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించి వడ్డీ రాయితీతో రూ.2లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తారు. గరిష్ఠంగా రూ.3లక్షల రుణం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఇప్పటి వరకూ వ్యవస్థాగత రుణ పరిధిలో లేని ఈ రైతులకు తక్కువ వడ్డీకి అప్పు దొరుకుతుంది.

మధ్య తరగతికి రాయితీ రుణం పథకం పొడిగింపు

ఇళ్ల కొనుగోలు నిమిత్తం రూ.6లక్షలు-రూ.18 లక్షల వార్షిక ఆదాయం ఉన్న దిగువ మధ్య తరగతి వర్గాలకు 2017 మే నుంచి అమలు చేస్తున్న రుణ అనుసంధాన రాయితీ పథకం (క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీం-క్లాస్‌)ను 2021 మార్చి వరకు పొడిగించారు. ఇంటి కోసం తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీలో 6.5 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. ఇందువల్ల ఈఎంఐల భారం తగ్గుతుంది. ఈ పథకం గత మార్చి 31తో ముగియగా, దీన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు నిర్మల చెప్పారు. దీని వల్ల గృహ నిర్మాణ రంగంలోకి రూ.70వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం లెక్కేసింది.

కార్మికులందరికీ కనీస వేతనం

ఇప్పుడున్న 40 కార్మిక చట్టాలను ఒక్కటిగా చేసి కార్మిక స్మృతి (లేబర్‌ కోడ్‌) రూపంలో తీసుకొస్తున్నందువల్ల ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందుతుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇప్పటి వరకు 30% మంది మాత్రమే కనీస వేతన చట్ట పరిధిలో ఉండగా, ఇకపై 100% మందికి కనీస వేతనం అందుతుంది. కనీస వేతనం విషయంలో ఉన్న ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి జాతీయ జీవన ప్రమాణ వేతనం (నేషనల్‌ ఫ్లోర్‌ వేజ్‌) విధానం అమల్లోకి రానుంది. పది మంది ఉద్యోగులున్న సంస్థలకూ ఈఎస్‌ఐ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న శాశ్వత ఉద్యోగికి కూడా గ్రాట్యుటీ సౌకర్యం లభిస్తుంది.

ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలు ముఖ్యంగా మన రైతులు, వలస కూలీలకు మేలు చేస్తాయి. ఈ పురోగమన చర్యలు ఆహార భద్రతకు, రైతులు, వీధి వ్యాపారులకు రుణ సౌకర్యం కల్పించడానికి దోహదం చేస్తాయి. – ప్రధాని నరేంద్ర మోదీ

ఇది మోసపూరిత ప్యాకేజీ. నడిచి వెళ్తున్న వలస కూలీలను ఇళ్లకు చేర్చడానికి ఏవైనా ఏర్పాట్లు చేస్తారని ఆశించాం. అలాంటిదేమీ లేదు. – కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు ఆనంద్‌ శర్మ, మనీష్‌ తివారీ

ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డు విధానం

రేషన్‌ కార్డులు లేని కారణంగా తిండి గింజలు అందుకోలేని దుస్థితిని పూర్తిగా మార్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆగస్టుకల్లా ‘ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీనివల్ల దేశ వ్యాప్తంగా 67 కోట్ల మంది (83%) ప్రయోజనం పొందుతారు. రేషన్‌ కార్డుల్లోని సభ్యుల్లో కొంతమంది సొంత ఊళ్లలో, మరికొందరు వేరే ఊర్లలో ఉంటే… ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఎక్కడున్నవారు అక్కడ రేషన్‌ తీసుకొనే అవకాశం కల్పిస్తారు. 2021 మార్చికల్లా దీన్ని అమల్లోకి తెస్తారు.

వీధి వ్యాపారులకు రూ.5 వేల కోట్ల రుణాలు

దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.10 వేల చొప్పున రూ.5వేల కోట్ల మేర రుణాలు ఇవ్వనుంది. డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించే వారికి భవిష్యత్తులో రుణ పరిమితి పెరుగుతుంది.

సొంతూర్లలో ఉపాధి హామీ

వలస కూలీలకు ఊళ్లలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తారు. రానున్న వర్షాకాలంలో ఈ పథకం కింద మొక్కలు, ఉద్యానవనాల పెంపకం, పశుపాకల నిర్మాణంలాంటి పనులు చేపడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *