నియామకాలపై వెనక్కితగ్గని ఆర్థిక సేవల దిగ్గజం
Covid ప్రభావంతో అనిశ్చితి వెంటాడుతున్నా విస్తరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ నిర్ణయించింది. ఎంపిక చేసిన 1460 మంది భారత గ్రాడ్యుయేట్లను ఈ వేసవిలో విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గుచూపింది. 1460 మంది భారత గ్రాడ్యుయేట్లలో సగం మందిని బెంగళూర్‌లోని బ్యాంక్ టెక్నాలజీ సెంటర్లో పూర్తికాలపు ఉద్యోగాల్లో తీసుకుంటామని, మిగిలిన వారిని ఇంటర్న్‌షిప్‌కు అనుమతిస్తామని గోల్డ్‌మన్ శాక్స్ బ్యాంక్ భారత్ చీఫ్ గుంజన్ సంతానీ తెలిపారు.
బెంగళూర్‌లోని గోల్డ్‌మన్ టెక్నాలజీ సెంటర్ ప్రపంచంలోనే ఆ సంస్థకు రెండో అతిపెద్ద కేంద్రం కావడం గమనార్హం. కాగా, లాక్డౌన్ ముగిసిన అనంతరం సంస్థ సిబ్బందిలో 40 నుంచి 50 శాతం ఉద్యోగులను విధుల్లోకి అనుమతించాలని సంతానీ యోచిస్తున్నామని చెప్పారు. కరోనా కలకలంతో దేశీయ, విదేశీ కంపెనీలు, టెక్నాలజీ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్లను ఉపసంహరించుకుంటున్న క్రమంలో గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ హైరింగ్ ప్రణాళికలతో ముందుకు వెళ్లడం సానుకూల పరిణామంగా భావిస్తున్నారు.