*కొవిన్ వైపు విదేశాల చూపు* *వ్యాక్సినేషన్ జోరందుకుంటే పోర్టల్ ప్రయోజనాలు మరింత స్పష్టం*
*‘ఈటీవీ భారత్’తో కొవిన్ ఛైర్మన్ రామ్ సేవక్ శర్మ* దిల్లీ: భారత్‌లో టీకా పంపిణీ ప్రక్రియకు ‘కొవిన్’ సాంకేతిక వెన్నెముకగా నిలుస్తోందని ఆ పోర్టల్ ఛైర్మన్ రామ్ సేవక్ శర్మ అన్నారు. అద్భుత పనితీరును కనబరుస్తున్న ఇలాంటి పోర్టల్‌ను తమ దగ్గర కూడా ఏర్పాటుచేయాలని పలు దేశాలు కోరుతున్నట్లు చెప్పారు.
దేశంలో డిమాండుకు సరిపడా డోసులు అందుబాటులోకి వచ్చాక.. కొవిన్ ప్రయోజనాలు మరింత స్పష్టంగా అందరికీ తెలిసొస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇతర టీకాల పంపిణీలోనూ ఈ పోర్టల్‌ను ఉపయోగించే యోచన ఉందని తెలిపారు. తాజాగా ‘ఈటీవీ భారత్’తో ముఖాముఖిలో ఈ మేరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలివీ.. *కొవిడ్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి అండగా నిలవడంలో కొవిన్ ఎంతవరకు విజయవంతమవుతోంది?*
భారత్‌లో నిర్వహిస్తున్నది.. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌లలో ఒకటి. దానికి సాంకేతిక వెన్నెముకగా కొవిన్ నిలుస్తోంది. ఈ నెల 19 నాటికి పోర్టల్‌లో 30.06 కోట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఆన్‌లైన్‌లో, నేరుగా టీకా కేంద్రానికి వెళ్లడం ద్వారా చేసుకున్న రిజిస్ట్రేషన్లన్నీ ఇందులో ఉన్నాయి. 1.03 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ కేంద్రాలు కొవిన్‌లో అందుబాటులో ఉన్నాయి. డిమాండుకు సరిపడా డోసులు అందుబాటులోకి వచ్చి, దేశంలో టీకా పంపిణీ ఊపందుకున్నాక పోర్టల్ విలువ అందరికీ మరింత స్పష్టంగా అర్థమవుతుంది.
*కొవిన్ వంటి పోర్టళ్లను తమ దగ్గర ఏర్పాటుచేయాలని పలు దేశాలు మిమ్మల్ని సంప్రదించినట్లు తెలిసింది. వాటికి మద్దతిస్తారా?*
టీకా పంపిణీ ప్రక్రియను డిజిటలీకరించడంలో అండగా నిలవాలని నైజీరియా సహా పలు దేశాలు కోరాయి. మిత్ర దేశాలకు.. సాధ్యమైన అన్నివిధాలా బాసటగా నిలిచే విషయంలో ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి మాకు అనుమతి లభించింది.
*స్పుత్నిక్, ఇతర టీకాలు అందుబాటులోకి వచ్చాక కూడా కొవిన్ సేవలు యథాతథంగా కొనసాగుతాయా?*
స్పుత్నిక్, ఫైజర్.. బ్రాండ్ ఏదైనా కానివ్వండి.. వాటిని పొందేందుకు కొవిన్ రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఇతర వ్యాక్సినేషన్ ప్రక్రియలకూ దీన్ని వినియోగించే యోచనలో ఉన్నాం.
*దిల్లీలో తొలి డోసు వేయించుకున్న వ్యక్తి.. రెండో డోసును తమిళనాడులోనో, ఈశాన్య రాష్ట్రాల్లోనో తీసుకోవచ్చా?*
కొవిన్‌లో పౌరులకు భౌగోళిక అడ్డంకులేవీ ఉండవు. యావత్ భారతావని కోసం రూపొందించిన పోర్టల్ ఇది. స్లాట్‌ల ఖాళీని బట్టి ఏ డోసును ఎక్కడైనా తీసుకోవచ్చు. తొలి డోసు తీసుకున్నాక..
రెండో డోసు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా కేంద్రానికి వెళ్లినా పర్లేదు. అక్కడ మొబైల్ నంబర్ చెప్పి, నిర్దిష్ట ఫొటో గుర్తింపు కార్డును చూపిస్తే రెండో డోసు వేస్తారు.