*ఈ నెలలోనే కరోనా మూడో ఉద్ధృతి!* *అక్టోబరులో తార స్థాయికి చేరొచ్చు* *రెండో విజృంభణ కన్నా తక్కువ తీవ్రతే ఉంటుంది*
*ఐఐటీ పరిశోధకుల విశ్లేషణ*
దిల్లీ: భారత్‌లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. గణిత నమూనా సాయంతో ఐఐటీ పరిశోధకులు ఈ అంచనాలు వేశారు. గతంలో రెండో ఉద్ధృతిపైనా వీరు కచ్చితమైన లెక్కలు కట్టడం ఇక్కడ ప్రస్తావనార్హం. విద్యాసాగర్ (హైదరాబాద్ ఐఐటీ), మణింద్ర అగర్వాల్ (కాన్పుర్ ఐఐటీ) నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. మూడో ఉద్ధృతి తార స్థాయిలో ఉన్నప్పుడు రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష లోపు ఉంటుందని చెప్పారు. పరిస్థితులు మరింత దిగజారితే అది 1.5 లక్షలకూ చేరొచ్చన్నారు. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పరిస్థితిని అకస్మాత్తుగా మార్చేయవచ్చని కూడా తెలిపారు. రెండో ఉద్ధృతి ఈ ఏడాది మే 7న గరిష్ఠ స్థాయికి చేరింది. నాడు అత్యధికంగా రోజుకు 4లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వేగంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌కు హాట్ స్పాట్లుగా మారుతున్న ప్రాంతాలను సత్వరం గుర్తించడానికి నిరంతర పరిశీలన అవసరమన్నారు. కొత్త వేరియంట్లను పట్టుకోవడానికి వైరస్ జన్యుక్రమాలను మరింత ఎక్కువగా ఆవిష్కరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ తాజా విజృంభణకు కారణమైన డెల్టా రకం కరోనా వైరస్.. భారత్‌లోనే తొలుత వెలుగు చూసిన అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
Teluguwonders