*అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ ఆతిథ్యం*
*వచ్చే మార్చి 24 నుంచి 27 వరకు బేగంపేటలో నిర్వహణ*
*అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ ఆతిథ్యం*
హైదరాబాద్: తెలంగాణ మరోసారి అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన (వింగ్స్ ఇండియా 2022)కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే మార్చి 24 నుంచి 27 వరకూ బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించనున్నారు. పౌరవిమానయాన శాఖ, జాతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫికీ¨్క) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి కానుంది. ఇందులో 25 విమానాలతో పాటు 20 హెలికాప్టర్లు, కొత్తగా రూపొందించిన డ్రోన్లను ప్రదర్శిస్తారు. 150కి పైగా విమానాలు, హెలికాప్టర్ల తయారీ సంస్థల ఉత్పత్తుల స్టాళ్లు ఉంటాయి. వైమానిక సంస్థల అధిపతులు, ముఖ్యకార్య నిర్వహణ అధికారులు(సీఈవో), సాంకేతిక నిపుణులు, సరఫరాదారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వైమానిక పురోగతి, పరిశ్రమలు, ఎయిర్‌లైన్స్, వైమానిక సేవలు తదితర అంశాలపై సదస్సులు జరుగుతాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పలుదేశాల వైమానిక మంత్రులు ఇందులో పాల్గొంటారు. ఇటీవలే ఫిక్కీ ప్రతినిధులు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి సదస్సు నిర్వహణ ఏర్పాట్ల గురించి చర్చించారు. త్వరలో మంత్రి కేటీఆర్ ఈ ప్రదర్శన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.