*విద్యాసంస్థలు తెరవొచ్చు!* *సూత్రప్రాయంగా వైద్యశాఖ పచ్చజెండా*
హైదరాబాద్: గతేడాది మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో రెండు మాసాలు మినహా నిరవధికంగా మూసివేసి ఉన్న విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది. తల్లిదండ్రుల్లోనూ ఎక్కువ మంది కనీసం ఒక డోసైనా తీసుకున్నట్టు వివరించింది. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలు, కళాశాలలను నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. ఈ మేరకు విద్యాశాఖకు ఇటీవల సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపినట్లుగా వైద్యవర్గాలు పేర్కొన్నాయి. విద్యాశాఖ లిఖితపూర్వకంగా అభిప్రాయాన్ని కోరకపోవడంతో.. తాము కూడా అడిగిన సందేహాలను మౌఖికంగానే నివృత్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై ఉన్నతస్థాయిలో సమావేశం జరిగే అవకాశాలున్నాయనీ, అందులో విద్యాసంస్థలను ప్రారంభించడంపై మరింత స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటారని పేర్కొన్నారు. * రెణ్నెల్లుగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రోజుకు 500-700 మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి. నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ నగర తదితర జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో మినహా రాష్ట్రం మొత్తమ్మీద కరోనా తగ్గుముఖం పట్టినట్లుగా వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి కొవిడ్ వ్యాప్తి రేటు పలు రాష్ట్రాల్లో 1:1 ఉంటూండగా మన వద్ద అది ఒకటి కంటే తక్కువగా ఉంది. ఇది ప్రమాదకర సంకేతమేమీ కాదని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. * దాదాపు ఏడాదిన్నరగా బడికి, కళాశాలలకు దూరంగా ఉంటున్న పలువురు విద్యార్థుల్లో తెలియకుండానే మానసిక సమస్యలు పెరిగిపోయాయనీ, ఆ ప్రభావం తల్లిదండ్రులపైనా పడుతోందని వైద్యవర్గాలు తెలిపాయి. * ఆన్‌లైన్ విద్య వల్ల విద్యార్థుల మనోవికాసం దెబ్బతింటోందనీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతోనే అస్తమానం కాలం గడుపుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. * ‘‘అన్ని తరగతులను ఒకేసారి తెరవాలా? దశల వారీగా ప్రారంభించాలా? అనేది మీరే నిర్ణయించుకోండి. తరగతులు తెరిచిన తర్వాత విద్యాసంస్థల్లో నిత్యం శానిటైజేషన్ నిర్వహించాలి. తరగతి గదుల్లో గాలి, వెలుతురు బాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు సురక్షిత దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేయాలి. ఉపాధ్యాయులు సహా పిల్లలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. మధ్యాహ్న భోజన సమయాల్లో, ఇతరత్రా సందర్భాల్లో విద్యార్థులు ఒకేచోట గుమిగూడకుండా చర్యలు చేపట్టాలి’’ అని వైద్య శాఖ విద్యాశాఖకు సూచించినట్లు తెలిసింది.