Andhra News: మా గోడు వినండి మహా ప్రభో.. అర్ధ నగ్నంగా ఆదివాసిల నిరసన.. ఎందుకో తెలుసా..?

ఏజెన్సీలో మారుమూల ప్రాంతాల అడవి బిడ్డల కష్టాలు అన్ని ఇన్ని కావు. అడవిలో జీవనం.. కనీస సౌకర్యాలు వారికి ఆమడ దూరం..! పోనీ.. నడిచేందుకు రహదారి అయినా ఉంటుందా అంటే.. మారుమూల ప్రాంతాల ప్రజలు వాటిని ఎరుగరు. కొండలు గుట్టలు దాటుకుంటూనే వాళ్ళ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. తమ గోడును కనిపించిన వారందరికీ ప్రతిసారి వెళ్ళబోస్తూనే ఉంటారు. వారి కష్టాలను కొందరు పట్టించుకున్నా.. అవి నేరవేర్చేందుకు ఏళ్లు పడుతున్నాయి. దీంతో తమ సమస్యలను తీర్చాలని వారు వినూత్న నిరసనలకు దిగారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని నివసించే గిరిజన ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. రోడ్లు లేవనే వాళ్ల ఆందోళలనలు పట్టించుకొని ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా.. రోడ్ల పనులు పూర్తయి కొన్నిచోట్ల నిలిచిపోయి.. మరికొన్ని చోట్ల అసలు పనులే ప్రారంభం కాకుండా ఉండిపోతున్నాయి. దీంతో.. తమ గ్రామాలకు రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయో అని ఎదురు చూసి చూసి.. ఆ గిరిజనులు ఇప్పుడు గళం వినిపించేందుకు రోడ్డెక్కుతున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో గిరిజనులు అర్ధ నగ్నంగా గోచిలతో నిరసన తెలిపారు. రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరుతూ వినూత్నంగా డోలి యాత్ర నిర్వహించారు. పాత కొట్నా బిల్లి నుండి మోదకొండమ్మ గుడి వరకు 3 కిలోమీటర్లు అర్ధనగ్న డోలి యాత్ర నిర్వహించి తమ గోడు వినాలంటూ మొరపెట్టుకున్నారు.
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చిన్నపాసిలి నుండి టి అర్జపురం వరకు రోడ్డును తవ్వేశారు. భారీ వాహనాలు వల్ల ఉన్న రోడ్లు కాస్తా గుంతలుగా మారిపోయాయి. దీంతో పాత కోట్నిబిల్లి గ్రామానికి అంబులెన్స్ కూడా రాని పరిస్థితి నెలకొంది. గిరిజనులకు జ్వరం వస్తే డోలి కట్టాల్సిన పరిస్థితులు దాపరించాయి. చిన్నపాసిలి నుండి ఎర్ర బంధ, కే గదపాలెం, కే.కొట్నాబెల్లి, పీ కోట్నాబెల్లి, రామన్న దొరపాలెం, డోలవానిపాలెం, టి అర్జ పురం గ్రామాల్లో 8వేల మంది జనాభా ఉంటారు. 2023 లో 14 కిలోమీటర్ల రోడ్డు నిర్మానానికి నిధులు మంజూరు చేశారు. 2024 జనవరి నెలలో పనులు మొదలుపెట్టారు. 6 కిలోమీటర్ వరకు గ్రావెల్. పిక్క వేసి రోలింగ్ చేశారు. మరో రెండు కిలోమీటర్లు పి కోట్నాబెల్లి నుండి రామన్న దొర పాలెం వరకు రోడ్డుని తవ్వేసి వదిలేశారు.
అయితే ఆ రోడ్డులో భారీ లారీలు తిరగడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు పనులు ఎందుకు నిలుపుదల చేశారని ఇంజనీరింగ్ అధికారులు అడిగితే… చేసిన రోడ్డు పనులు బిల్లు అవ్వలేదని చెప్తున్నారని స్థానికుల అంటున్నారు. దశల వారీగా ఆందోళన చేస్తున్న ఈ ఆదివాసీలు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గోచి డోలి యాత్ర నిర్వహించారు. ఆదివాసి గిరిజనులు గ్రామ సచివాలయం రావాలంటే 15 కిలోమీటర్ల నడిచి రావాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలని, జిల్లా కలెక్టర్‌ను కోరారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
