బీజేపీ లో చేరనున్న మరో మాజీ మంత్రి..

Teluguwonders:
మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణలో బలపడాలని చూస్తున్న కీలక నేతలకు గాలం వేస్తోంది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులను పార్టీలోకి ఆహ్వానించింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో చేరిక ఖాయంగా కనిపిస్తోంది.
👉వివరాల్లోకి వెళ్తే :
తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి ఆహ్వానించారు. సుమారు రెండు గంటల పాటు ఆయనతో చర్చించారు. బీజేపీ నేతల ఆహ్వానానికి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేతలు 18వ తేదీన బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో చేరనున్నారు. ఇందుకోసం బీజేపీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు. అయితే మోత్కుపల్లి ఆరోజు కాకుండా వారం తర్వాత అంటే ఆగస్టు 25న కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్న మోత్కుపల్లి చంద్రబాబు చర్యలకు నిరసనగా అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మీడియా సాక్షిగా చంద్రబాబుపై ఆయన అనేక తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మళ్లీ గెలవకూడదని తిరుమలకు పాదయాత్ర కూడా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే చంద్రబాబు ఓడిపోయినా.. తన రాజకీయ భవిష్యత్ మాత్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఏ పార్టీలోకి వెళ్లాల్లో తెలీక ఆయన ఇన్నాళ్లూ సందిగ్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ నిర్ణయం విరమించుకున్నారు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ కీలక నేతలకు గాలం వేస్తున్న తరుణంలో మోత్కుపల్లి కాషాయ దళంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
