Bihar Elections: ఆ ఆరుసీట్లు వదిలేస్తే మద్దతిస్తా.. అసదుద్దీన్ ఒవైసీ ఓపెన్ ఆఫర్.. కానీ, సీన్ రివర్స్..

ఇండి కూటమిలో చేరాలన్న ఒవైసీ ప్రయత్నాలు ఫలించడం లేదు. బిహార్‌లో తమకు ఆరు సీట్లు ఇవ్వాలన్న మజ్లిస్ అభ్యర్ధనకు ఆర్జేడీ నేతలు ఒప్పుకోలేదు. బీజేపీకి ఒవైసీ బీటీమ్‌గా మారారని, మజ్లిస్‌ను తాము నమ్మడం లేదంటున్నారు ఆర్జేడీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తమ పవర్ తెలుస్తుందని ఆర్జేడీ నేతలకు ఒవైసీ కౌంటరిచ్చారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీకి ఇండి కూటమి నేతల నుంచి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఆరుసీట్లలో గెలిచిందని , ఆ సీట్లను తమకు ఇవ్వాలని ఒవైసీ ఇండి కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు. ఆరుసీట్లు వదిలేస్తే బిహార్‌లో మిగతా సీట్లలో ఇండి కూటమి అభ్యర్ధులకు మద్దతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.
‘‘మాకు ఆరు సీట్లు ఇవ్వాలని లేఖ రాశాం. ఇక వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. బీజేపీని ఎవరు గెలిపిస్తారో , ఎవరు అడ్డుకుంటారో బిహార్ ప్రజలే నిర్ణయిస్తారు. చర్చలు జరపలేదని ఎవరు తరువాత మమ్మల్ని విమర్శించరాదు. మేము అన్ని ప్రయత్నాలు చేశాం. జనం ముందు మా ప్రతిపాదనలు పెట్టాం. ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో త్వరలో తెలుస్తుంది..’’ – ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ
ఒవైసీ ఆఫర్‌కు ఆర్జేడీ నేతల తిరస్కరణ
అయితే ఒవైసీ ఆఫర్‌ను ఆర్జేడీ నేతలు తిరస్కరించారు. ఒవైసీని తాము నమ్మడం లేదని, మజ్లిస్ పార్టీ బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తోందని వాళ్లు విమర్శలు కురిపిస్తున్నారు. మజ్లిస్ హైదరాబాద్‌లోనే పోటీ చేస్తే బాగుంటుందని, ఆర్జేడీ హైదరాబాద్‌లో పోటీ చేయడం లేదన్న విషయాన్ని ఒవైసీ గుర్తించాలంటున్నారు. ఒవైసీకి దమ్ముంటే బిహార్‌లోని అన్ని సీట్లలో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఆర్జేడీ నేతల తీరుపై ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సత్తా ఏంటో ఎన్నికల తరువాత తెలుస్తుందన్నారు. మజ్లిస్ పార్టీ ఎవరికి బీటీమ్‌గా పనిచేయడం లేదని స్పష్టం చేశారు. త్వరలో అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తామన్నారు ఒవైసీ..
ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై గురిపెట్టారు ఒవైసీ. సీమాంచల్‌లో ఒవైసీ సభలకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లి్‌స్ ఆరుసీట్లలో విజయం సాధించడంతో పాటు ఓట్ల శాతాన్ని పెంచుకుంది. సీమాంచల్‌లో ఒవైసీ ఒంటరిగా బరి లోకి దిగితే ఇండి కూటమి అభ్యర్ధులకు చాలా నష్టం జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
