సత్వర న్యాయానికి కరోనా దెబ్బ

IMG-20200712-WA0012.jpg

*సత్వర న్యాయానికి కరోనా దెబ్బ* *విచారణ ప్రక్రియకు అవాంతరం* *బెయిల్‌, ఇంజంక్షన్‌ పిటిషన్ల పైనే విచారణ*

*హైకోర్టులో కాస్త మెరుగైన పరిస్థితి*

హైదరాబాద్‌: కోర్టుల్లో ఇప్పటికే పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా సత్వర న్యాయం మరింత ప్రశ్నార్థకంగా మారింది. కొవిడ్‌ దెబ్బతో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కోర్టుల్లో విచారణ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడ్డాయి.

ఒక్క హైకోర్టులో కాస్త మెరుగ్గా కేసుల విచారణ కొనసాగుతున్నప్పటికీ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం బెయిలు పిటిషన్లు, సివిల్‌ కేసుల్లో ఇంజంక్షన్లకు సంబంధించిన పిటిషన్ల పైనే విచారణ జరుగుతోంది. ఇరుపక్షాల్లో సాక్ష్యాల పరిశీలన, సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ పూర్తయి కేవలం వాదనలు మాత్రమే పెండింగ్‌ ఉన్న కేసుల్లోనూ విచారణ జరగడంలేదు. మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి న్యాయం స్తంభించిపోయింది.

ఎప్పటికప్పుడు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ పోతుండటంతో కేసుల విచారణ కొనసాగడం లేదు. జూన్‌ 15 నుంచి కోర్టుల్లో ఫిజికల్‌ ఫైలింగ్‌తోపాటు కేసుల విచారణ కొనసాగించాలని హైకోర్టు తీర్మానించి ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని నిర్దేశించింది.

కరోనా మహమ్మారి విజృంభించడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈనెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ఫైలింగ్‌, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. ఈలోగా హైకోర్టు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

*న్యాయాధికారులు, సిబ్బందికి కొవిడ్‌ బెడద*

రాష్ట్ర వ్యాప్తంగా కొంత మంది న్యాయాధికారులు, సిబ్బంది కరోనా బారినపడినట్లు తెలిసింది. హైకోర్టులో 5 విడతలుగా జరిపిన పరీక్షల్లో సుమారు 27 మందికి పైగా కరోనా బారినపడ్డారని సమాచారం. జ్యుడీషియల్‌ అకాడమీలో ఒకరు మృతి చెందగా అక్కడ ఉన్న సిబ్బంది, క్వార్టర్లలోనూ కరోనా పరీక్షలను నిర్వహింపజేశారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలో ఓ ఉద్యోగితో మొదలైన కరోనా వ్యాప్తి ప్రస్తుతం ఫైలింగ్‌ సెక్షన్‌ దాకా వచ్చింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో హైకోర్టు విచారణ కేసులను తగ్గించుకుంది.

*ఆదర్శంగా హైకోర్టు*

లాక్‌డౌన్‌ సమయంలో ఇతర హైకోర్టులతో పోల్చితే రాష్ట్ర హైకోర్టు ఆదర్శంగా పని చేసిందని చెప్పవచ్చు. అన్ని బెంచ్‌లు పనిచేసిన హైకోర్టు ఇదే. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 12 కోర్టు హాళ్లలో విచారణ జరిగింది. ఇందులో 9 సింగిల్‌ జడ్జి బెంచీలు కాగా, డివిజన్‌ బెంచీలు రెండు పనిచేశాయి. మార్చి 23 నుంచి జులై 8 దాకా సుమారు 17598 కేసుల విచారణ చేపట్టగా 2864 కేసులను పరిష్కరించింది.రోజూ సగటున 166 కేసుల దాకా విచారణ చేపట్టింది. ఒక దశలో అడ్మిషన్లతోపాటు పెండింగ్‌ కేసుల విచారణను చేపట్టి రెగ్యులర్‌ కోర్టును తలపించింది. అయితే కేసులకు సంబంధించిన ఫైళ్లను స్కాన్‌ చేసి జడ్జీల ఇంటివద్దకు పంపడం, ఫైళ్లను తరలించడం తదితర పనులను చేసే పలువురు సిబ్బంది కరోనా బారిన పడటంతో ఫుల్‌కోర్టు సమావేశమై అత్యవసర కేసుల విచారణ మాత్రమే చేపట్టాలని నిర్ణయించింది. కింది కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యంలేని న్యాయవాదుల కోసం దేశంలోనే మొదటిసారి మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని వరంగల్‌లో హైకోర్టు ఏర్పాటు చేసింది. సాధ్యమైనంత మేర న్యాయం అందించడానికి హైకోర్టు కృషి చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రమే.

*ఒత్తిడిలో న్యాయవాదులు*

లాక్‌డౌన్‌ దెబ్బకు కోర్టులు జరగకపోవడంతో న్యాయవాదుల పరిస్థితి దారుణంగా తయారైంది. కొంత మందికే బెయిళ్లు, ఇంజంక్షన్‌ వంటి పిటిషన్లు వస్తుండటంతో ఎక్కువ శాతం మంది వద్దకు కేసులే రావడంలేదు. కేవలం క్రిమినల్‌ కేసుల్లో బెయిళ్లు తప్ప మరే కేసులూ విచారణకు రావడంలేదు. సివిల్‌ కేసుల విచారణ సాగకపోవడంతో కక్షిదారులు న్యాయవాదులపై ఒత్తిడి తెస్తున్నారు.

ఆదాయం లేక ఓవైపు న్యాయవాదులు ఇబ్బందులు పడుతుంటే వారిపై ఆధారపడిన గుమస్తాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights