ప్రైవేటు ల్యాబుల్లో తప్పులతడకలు

IMG-20200627-WA0000.jpg

*ప్రైవేటు ల్యాబుల్లో తప్పులతడకలు* *కొవిడ్‌ పరీక్షల్లో నిబంధనల ఉల్లంఘన* *నెగిటివ్‌ వచ్చినా పాజిటివ్‌గా ఫలితమిచ్చారనే సందేహాలు* *ఒక్కోచోట ఒక్కో రకం సమాచారం* *ఐసీఎంఆర్‌ నిబంధనలూ బేఖాతరు* *ప్రభుత్వానికి తనిఖీ బృందాల సమగ్ర నివేదిక* హైదరాబాద్‌: ఒక ప్రముఖ ఆసుపత్రి ప్రయోగశాలలో వాస్తవానికి నిర్వహించిన పరీక్షలు 3,940. అప్‌లోడ్‌ చేసింది 1,568 పరీక్షల సమాచారాన్ని మాత్రమే. 475 పాజిటివ్‌లు వచ్చినట్లుగా చూపించారు. ఇవన్నీ పరిశీలిస్తే.. వాస్తవానికి తక్కువగా ఉన్న పాజిటివ్‌ల నమోదు శాతాన్ని ఎక్కువగా చూపించినట్లు వెల్లడవుతోంది. అన్ని పరీక్షల వివరాలను అప్‌లోడ్‌ చేస్తే.. పాజిటివ్‌ల శాతం తక్కువగా ఉండేది._ ప్రైవేటు ల్యాబులు కరోనా పరీక్షల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ తనిఖీ బృందాలు తేల్చాయి. కొవిడ్‌ పరీక్షల విషయంలో ఐసీఎంఆర్‌ నిబంధనలనూ పాటించడంలేదని చెప్పాయి. కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఉన్నా ల్యాబులు పట్టించుకోవడం లేదని, కొన్ని ల్యాబుల్లో నెగిటివ్‌ వచ్చినా పాజిటివ్‌ ఇచ్చారనే అనుమానాలున్నాయని తనిఖీ బృందాలు వెల్లడించాయి. ఈనెల 23న ఆరోగ్యశ్రీ కార్యాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి సమక్షంలో ప్రైవేటు ల్యాబొరేటరీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వారికున్న సందేహాలను కూడా నివృత్తి చేశారు. ఆ మర్నాడే ఈనెల 24న ప్రైవేటు ల్యాబులు అప్‌లోడ్‌ చేసిన సమాచారంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్లుగా వైద్యశాఖ గుర్తించింది. దీనిపై విచారణ జరపడానికి అత్యవసరంగా ఆరోగ్యశాఖ సీనియర్‌ మై‌కోబయాలజిస్ట్‌లు, అనుభవజ్ఞులైన అధికారులతో కూడిన నాలుగు బృందాలను నియమించింది. వీరు అన్ని ప్రైవేటు ప్రయోగశాలను తనిఖీ చేశారు. అక్కడున్న మౌలిక సదుపాయాలు, మానవవనరులు, ఇన్‌ఫెక్షన్‌ నివారణ పద్ధతులు తదితర అన్ని అంశాలను పరిశీలించారు. పరీక్షల సమాచారాన్ని పొందుపరుస్తున్న పుస్తకాన్ని, ఐసీఎంఆర్‌ పోర్టల్‌కు, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌కు అప్‌లోడ్‌ చేస్తున్న విధానాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఈ బృందాలు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాయి. బీఆర్‌కే భవన్‌లో మంత్రి రాజేందర్‌ శుక్రవారం ఇదే విషయంపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకరరెడ్డి, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డిలతో పాటు తనిఖీ బృంద సభ్యులతో భేటీ అయ్యారు. *నివేదికలో ముఖ్యాంశాలివి* * ప్రైవేటు ప్రయోగశాలల్లో కొవిడ్‌ సోకకుండా ముందస్తు రక్షణ చర్యలను పాటించడం లేదు. ఇందులో సిబ్బంది పీపీఈ కిట్లను ధరించడం లేదు. * సురక్షిత ప్రత్యేక గదులు(క్యాబిన్లు) అందుబాటులో లేవు. పరిశుభ్రతను కూడా పాటించడంలేదు. * కొన్ని ప్రయోగశాలల్లో ఇరుకు స్థలంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరికరాల నిర్వహణ కూడా సరిగా లేదు. * సిబ్బందికి ఆర్‌టీ-పీసీఆర్‌ (రియల్‌ టైమ్‌-రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలిమెరేజ్‌ చైన్‌ రియాక్షన్‌) పరీక్షా విధానంపై ఎటువంటి అవగాహన లేదు. సరైన శిక్షణ లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నారని తేలింది. * కొన్ని చోట్ల నాణ్యత నియంత్రణ చర్యలు, పరీక్షల నిర్వహణకు నిర్ణీత గడువు విధానాలను పాటించడం లేదు. * కొన్ని ప్రయోగశాలలు నిబంధనలను ఉల్లంఘించి, పెద్దఎత్తున నమూనాలను (పూల్‌డ్‌ టెస్టింగ్‌) సేకరించినట్లుగా విచారణలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా పూల్‌డ్‌ టెస్ట్‌ల్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చినా, విడిగా మళ్లీ అన్ని పరీక్షించాలి.ఎందుకంటే ఉదాహరణకు 20 నమూనాలను ఒకేసారి తీసుకుంటే.. అందులో ఒకరికి పాజిటివ్‌ వస్తే.. మిగిలిన వారికి నెగిటివ్‌ రావచ్చు. అలాంటప్పుడు మళ్లీ 20 నమూనాలను విడివిడిగా పరీక్షించాల్సి ఉంటుంది.అలా కాకుండా మొత్తం పూల్‌డ్‌ టెస్టుల్లో ఒక ఫలితాన్నే అన్నింటికీ వర్తింపజేసి, అన్ని నమూనాలను పాజిటివ్‌గానే వెల్లడించినట్లుగా అనుమానాలున్నాయి. దీనివల్ల నెగిటివ్‌ నమూనాను కూడా పాజిటివ్‌గా వెల్లడించినట్లు అవుతుంది. నిపుణులు ప్రయోగశాలలో నమూనాలను పరిశీలించినప్పుడు ఈ తరహా అనుమానాలొచ్చినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. * ప్రయోగశాలల్లో పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల నమూనాలు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. * కొన్ని ప్రయోగశాలలు ఎటువంటి వైద్యుని చీటి, సూచనలు లేకుండానే నేరుగా వస్తున్న వ్యక్తుల నుంచి నమూనాలు స్వీకరిస్తున్నాయి. నమూనాల సేకరణపై ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నాయి. * పాజిటివ్‌ లేకపోయినా కరోనా ఉన్నట్లుగా ఫలితమిస్తూ ప్రజలను తప్పుదోవపట్టించడమే కాకుండా.. ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల అక్కడికి వచ్చే ఇతరులకు, సాంకేతిక నిపుణులకు కూడా కొవిడ్‌ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. * ప్రైవేటు ల్యాబులు ఇస్తున్న ఫలితాలు సరైనవా? కావా? అనేది తేల్చడానికి మరోసారి ప్రైవేటు ల్యాబొరేటరీల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరముందని నివేదికలో నిపుణుల బృందం పేర్కొంది. * గాంధీ వైద్యకళాశాలనిపుణుల బృందం ప్రైవేటు ల్యాబు ల్లో నాణ్యతాప్రమాణాలను పర్యవేక్షించాలని ఐసీఎంఆర్‌ పేర్కొందనే విషయాన్ని నివేదికలో గుర్తుచేశారు. * ఐసీఎంఆర్‌ పోర్టల్‌, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌లో ప్రైవేటు ల్యాబులు అప్‌లోడ్‌ చేసే సమాచారం మధ్య వ్యత్యాసాలున్నాయి. ఇది చాలా పెద్ద నేరం. *ఉదాహరణకు..* * ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో పరీక్షల సంఖ్య: 9,577 * పాజిటివ్‌లు: 2,076 * రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్‌లోపరీక్షల సంఖ్య: 6,733 * పాజిటివ్‌లు: 2,836 * ల్యాబు రికార్డుల్లో పరీక్షల సంఖ్య: 12,700 * పాజిటివ్‌లు: 3,571


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights