92శాతం మంది మృత్యుంజయులే

IMG-20200701-WA0019.jpg

*92శాతం మంది మృత్యుంజయులే* *దీర్ఘకాలిక రోగుల్లోనూ కోలుకునే వారే అధికం*

*కరోనాతో భయం వద్దు.. జాగ్రత్తే ముద్దు*

హైదరాబాద్‌ 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. అప్పటికే అతనికి గుండె జబ్బు, అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రెండో దశలో ఉందని కొద్దిరోజుల కిందటే గుర్తించారు.అయినా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకొని ఇంటికెళ్లాడు. 14 రోజుల్లోపే తనలో వైరస్‌ లక్షణాలు తగ్గిపోయినా.. 28 రోజుల పాటు అసుపత్రిలో ఉంచుకున్నారు. శరీరంలో వైరస్‌ తగ్గిందని నిర్ధరించిన తర్వాతే పంపించారు. కరోనా వైరస్‌ బారినపడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో సుమారు 92 శాతం మంది ఆరోగ్యవంతులయ్యారు. మహమ్మారికి చిక్కిన దాదాపు 94 శాతం మంది మధుమేహ రోగులు, 89 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు క్షేమంగా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి జూన్‌ 28 నాటికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందినవారి సమాచారాన్ని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. ఇక్కడ చికిత్స పొందిన సుమారు 5 వేల మంది కొవిడ్‌ బాధితుల్లో సుమారు 50 శాతం(2500) మంది దీర్ఘకాలిక జబ్బులతో బాధపడినవారుండగా.. వీరిలో 203 మంది మృతిచెందారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా సోకినా.. అత్యధికులు జయిస్తుండటం ఆశావాహ పరిణామమే. అనుబంధ అనారోగ్య సమస్యలున్నవారిలో కొవిడ్‌ వస్తే ఇక మరణం తథ్యమనే ఆందోళన చెందనవసరం లేదని, తగిన జాగ్రత్తలతో కోలుకోవడం కష్టసాధ్యమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు.వచ్చాక ఆందోళన చెందడం కంటే.. వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. *అవగాహన ముఖ్యం* గాంధీ ఆసుపత్రిలో చికిత్సలను పరిశీలిస్తే.. ఒక్క దీర్ఘకాలిక వ్యాధితో మరణించినవారి సంఖ్య తక్కువే. అత్యధికుల్లో ఒకటి కంటే ఎక్కువ అనుబంధ దీర్ఘకాలిక వ్యాధులున్నప్పుడు కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నంత మాత్రాన కొవిడ్‌తో చనిపోరని, అయితే ఎక్కువ మందిలో వాటి వల్ల ఇతర అవయవాల పనితీరు మందగిస్తుందని, ఆ కారణంగా తెలియకుండానే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో కొన్నిసార్లు పరిస్థితి విషమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు. *నియంత్రణలో ఉంచుకోవాలి* _క్యాన్సర్‌ బారినపడినవారు 17 మంది కోలుకున్నారు. మూత్రపిండాల వైఫల్యంతో రక్తశుద్ధి చేయించుకుంటున్నవారిలోనూ 100 మందికి చికిత్స చేస్తే.. 70 మందిలో కొవిడ్‌ నయమైంది. పక్షవాతం వచ్చినవారు కూడా సుమారు 10 మంది వరకూ కోలుకున్నారు. కరోనా అనగానే భయపడక్కర్లేదు కానీ.. దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో మాత్రం ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడూ పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుని సంప్రదింపుల ద్వారా అవసరమైన ఔషధాలను క్రమం తప్పకుండా వాడాలి. శరీరానికి వ్యాయామం చాలా అవసరం. శారీరక శ్రమ ద్వారా కణాలు ఉత్తేజితమవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు తదితర పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి. – *డాక్టర్‌ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌*_ * రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో.. ఆదివారం నాటికి మరణాలు 247. అంటే 1.73 శాతం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో కొవిడ్‌ సోకడం వల్ల మృతిచెందిన వారు వీరిలో 203 మంది కాగా, ఇతర] అనారోగ్య సమస్యలు లేకుండా మృతిచెందిన వారు సుమారు 44 మంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నా మరణాల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరగకపోవడం ఊరటనిచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. * అధిక రక్తపోటు, మధుమేహం రెండూ ఉండి.. ఒకటో, రెండో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సుమారు 40 శాతం మంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights