చిన్నారులకు ఎంఐఎస్‌ ముప్పు!

Spread the love

*చిన్నారులకు ఎంఐఎస్‌ ముప్పు!*

*మెల్లగా బయటపడుతున్న లక్షణాలు* *గాంధీ, నిలోఫర్‌లో చేరుతున్న పిల్లలు* *నవజాత శిశువుల్లోనూ కనిపిస్తున్న సమస్య*

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి రెండో విడతలో చిన్నారులపై పంజా విసురుతోంది. ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ ఇబ్బందులతో 1-12 ఏళ్లలోపు పిల్లలు 274 మంది గాంధీ ఆసుపత్రిలో చేరారు. మరో నలుగురు నవజాత శిశువులు సైతం దాని బారిన పడ్డారు. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్నాక వారిలో ఎంఐఎస్‌ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌) లక్షణాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి.

ఇప్పటికే గాంధీలో ఇద్దరు చిన్నారులు ఆయా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిలోఫర్‌లోనూ అయిదుగురు నవజాత శిశువుల్లో ఎంఐఎస్‌ లక్షణాలు కన్పించినట్లు వైద్యులు తెలిపారు. జూన్‌ తర్వాత ఇలాంటి కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని గాంధీ, నిలోఫర్‌ వైద్యులు అంచనా వేస్తున్నారు. కరోనా తొలి దశలో కొవిడ్‌తో గాంధీలో 700 మంది చిన్నారులు చేరగా.. 58 మందిలో ఎంఐఎస్‌ సమస్య బయటపడింది. ఒకరిద్దరు తప్ప..అంతా కోలుకున్నారు. రెండో వేవ్‌లో ఉద్ధృతి కారణంగా పిల్లల్లో ఈసారి ఎంఐఎస్‌ ముప్పు పెరగవచ్చని వైద్యులు అంటున్నారు.

కరోనా తగ్గిన 6-8 వారాలలోపు ఈ సమస్య బయట పడుతుంది. ఏప్రిల్‌, మేలో కరోనా బారిన పడి కోలుకున్న చిన్నారులు కొందరిలో జూన్‌, జులైలో ఎంఐఎస్‌ బయటపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వచ్చే రెండు నెలలపాటు తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు.. లక్షణాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించాలని తెలిపారు.

*ఆందోళన వద్దు..అప్రమత్తత తప్పదు* తొలి, రెండో విడతల్లో ఇప్పటివరకు పిల్లలపై కరోనా అంతగా ప్రభావం చూపకపోవడం పెద్ద ఊరట అని గాంధీ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ సుచిత్ర తెలిపారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఎంఐఎస్‌ పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె సూచిస్తున్నారు.

* పిల్లల్లో జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలే ఉండి, ఇతర ఆరోగ సమస్యలేమీ లేకపోతే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి. ఆయాసం, వేగంగా శ్వాస తీసుకోవాల్సి రావడం, ఆహారం సరిగ్గా తినలేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే ఆసుపత్రిలో చేర్పించాలి. ఇలాంటి వారిలో కొందరికి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. * కొందరు పిల్లల్లో కరోనా వచ్చి తగ్గాక 6-8 వారాల తర్వాత ఎంఐఎస్‌ కన్పిస్తోంది. తొలి విడతలో ఎక్కువ మంది పిల్లలు ఈ సమస్యతో నిలోఫర్‌, గాంధీలో చేరారు. ప్రస్తుతం అలా వస్తున్నవారి సంఖ్య నిదానంగా ఉంది.

* లక్షణాలు ముందే గుర్తించి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తే తగ్గిపోతుంది. ఆలస్యం చేస్తే కొందరి పిల్లల్లో ప్రమాదకరంగా మారుతుంది. కొన్నిసార్లు కరోనా లక్షణాలు లేని పిల్లల్లోనూ ఇలాంటివి కన్పించవచ్చు. అయితే అప్పటికే వారికి వైరస్‌ సోకి తగ్గిందని గుర్తించాలి. కరోనా రాకపోయినా ఈ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

*అదనపు సౌకర్యాలు అత్యవసరం…* కరోనా మూడో దశలో పిల్లలపై ప్రభావం ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు నిలోఫర్‌, గాంధీలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలి. నిలోఫర్‌లో పది వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయి. కొత్తగా మరో 150 ఆక్సిజన్‌ పడకలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమయం తక్కువగా ఉండటంతో ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది.

గాంధీలో చిన్నారుల కోసం 120, నవజాత శిశువులకు మరో 40 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం 30 వెంటిలేటర్‌ పడకలు సిద్ధం చేశారు. పది మంది పిల్లల వైద్యులు, 21 మంది పీజీలు సేవలందిస్తారు. రోగుల సంఖ్య పెరిగితే వెంటిలేటర్లతో పాటు వైద్యులు, సిబ్బంది సంఖ్య సరిపోదని చెబుతున్నారు. అదనపు వెంటిలేటర్లు, హెచ్‌ఎస్‌ఎన్‌వో మాస్క్‌ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అత్యవసరంగా వీటిని సమకూర్చాల్సి ఉంది.

*ఎంఐఎస్‌ లక్షణాలివీ..*

* తీవ్రమైన కడుపు నొప్పి

* కాళ్లు, పొట్ట ఉబ్బరం

* విరేచనాలు, వాంతులు
* జ్వరం 8 రోజులకంటే ఎక్కువ ఉండటం

* నాలుక గులాబి రంగులోకి మారటం
* వేళ్ల సందులు, చేతి కింద నుంచి పొట్టులా రాలడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *