కస్టమర్‌.. బీ కేర్‌ పుల్‌.. నకిలీ కస్టమర్‌ కాల్‌ సెంటర్లతో దోపిడీ.

Customer-care-number_V_jpg--816x480-4g

వారం రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగి గోద్రేజ్‌ ఎయిర్‌ కండిషనర్‌ను రిపేర్‌ చేయించడానికి కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశారు. ఓ నంబర్‌ కనిపించగానే ఫోన్‌ చేశారు. అవతల వ్యక్తి ఒక లింక్‌ పంపి అతడి డీటైల్స్‌ నింపమన్నాడు.

  • కస్టమర్‌.. కేర్‌ పుల్‌..!
  • నకిలీ కస్టమర్‌ కాల్‌ సెంటర్లతో దోపిడీ
  • ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తున్నారా? ఇక మీరంతే.. మోసపోవడమే..
  • డబ్బులు కోల్పోతున్న బాధితులు

Customer Care Number | సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): వారం రోజుల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగి గోద్రేజ్‌ ఎయిర్‌ కండిషనర్‌ను రిపేర్‌ చేయించడానికి కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేశారు. ఓ నంబర్‌ కనిపించగానే ఫోన్‌ చేశారు. అవతల వ్యక్తి ఒక లింక్‌ పంపి అతడి డీటైల్స్‌ నింపమన్నాడు. బాధితుడు లింక్‌ ఓపెన్‌ చేసి తన వివరాలు నింపారు. ఆ తర్వాత అకౌంట్‌ నిర్ధారించుకోవడానికి రూ.10 పంపమంటే బాధితుడు ఫోన్‌ కట్‌ చేశాడు. తెల్లారి చూస్తే తన అకౌంట్‌ నుంచి 1.9లక్షలు పోయినట్లుగా గుర్తించాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన విమానం టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవాలని ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తున్న ఓ వృద్ధుడిని సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించి డబ్బులు కాజేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.4లో నివాసం ఉంటున్న ఎం.రాఘవరావు అనే వ్యాపారి ఈనెల 9న తన ఫ్లైట్‌ టికెట్‌ క్యాన్సిల్‌ చేయాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం చూస్తుండగా..ఓ వ్యక్తి ఫోన్‌ చేసి టికెట్‌ క్యాన్సిల్‌ చేసేందుకు వివరాలు తీసుకున్నాడు. టికెట్‌ వివరాలను, ఫోన్‌ పే వివరాలు ఇస్తే డబ్బులు అకౌంట్‌లో వేస్తానంటూ చెప్పాడు. దీంతో రాఘవరావు తన ఫోన్‌ను స్క్రీన్‌ షేర్‌ ద్వారా ఆగంతకుడికి యాక్సెస్‌ ఇచ్చాడు. వివరాలు ఇవ్వగానే ఫోన్‌పే ద్వారా రెండు దఫాలుగా రూ.94వేలు కాజేశాడు. దీనిపై బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నకిలీ కస్టమర్‌ సెంటర్లు..!

ఏసీ, ఫ్రిజ్‌.. ఇంకా ఏదైనా గృహోపకరణాలు రిపేర్‌ చేయించాలనుకుంటూ కంపెనీ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా..? అయితే జాగ్రత్త. నకిలీగాళ్లు ఉన్నారు. అదే పేరుతో ఫేక్‌ కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ ఉంటుంది. అక్కడి నుంచి కాల్‌ వస్తుంది. అందులో వారు అడిగిన సమాచారం ఇస్తే.. మీ డబ్బులు పోయినట్లే. ప్రస్తుతం డిజిటల్‌ మార్కెట్‌ను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌గా చేసుకున్నారు. ఆన్‌లైన్‌ అడ్డాగా అందినంతా దోచేస్తున్నారు.

నేరగాళ్లు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల పేరుతో నకిలీ కస్టమర్‌ సెంటర్లు ఓపెన్‌ చేస్తున్నారు. ఢిల్లీ, గుర్‌గావ్‌, కలకత్తా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ-కామర్స్‌ సైట్ల ఫేక్‌ టోల్‌ఫ్రీ నంబర్లు, కస్టమర్‌ సపోర్ట్‌ నంబర్లు వెతికే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏడాది కాలంలో హైదరాబాద్‌ సిటీలో సుమారు 220 కేసులు నమోదు కాగా, కస్టమర్లకు సంబంధించిన డబ్బులు సుమారుగా రూ.3కోట్ల వరకు సైబర్‌ నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లాయి.

ఈ నేపథ్యంలో ప్రతీయేటా ఫేక్‌ టోల్‌ఫ్రీ నంబర్ల సంఖ్య భారీగా పెరిగిపోతున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కనీస జాగ్రత్తలు పాటించకుండా డిజిటల్‌ పేమెంట్స్‌లో డబ్బులు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. ఫిర్యాదు చేయడానికి చాలా మంది ముందుకు రావడంలేదని పోలీసులు చెప్పారు. సైబర్‌ ఫ్రాడ్స్‌ ట్రాప్‌లో పడి డబ్బులు కోల్పోతున్న వారిలో కేవలం 45శాతం మంది మాత్రమే ఫిర్యాదులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.5వేల నుంచి రూ.10వేల వరకే పోగొట్టుకోవడంతో ఫిర్యాదులపై ఆసక్తి కనబర్చడంలేదని, పెద్ద మొత్తంలో డబ్బులు పోయినప్పుడే పోలీసుల వద్దకు వస్తున్నారని వారు చెప్పారు.

అసలు సైట్‌ను తలదన్నేలా..!

సైబర్‌నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్స్‌ క్రియేట్‌ చేసి గూగుల్‌ సెర్చ్‌లో పోస్ట్‌ చేస్తారు. ఒరిజినల్‌ సైట్‌ను కూడా గుర్తించలేని విధంగా అక్షరం మార్పుతో తయారు చేస్తుంటారు. కస్టమర్లు సెర్చ్‌ చేసిన వెంటనే ఒరిజినల్‌ సైట్‌తోపాటు నకిలీ వెబ్‌సైట్స్‌ డిస్‌ప్లే అయ్యేలా ప్లాన్‌ చేస్తారు. ఇలాంటి వెబ్‌పేజ్‌లో తమ నెట్‌వర్క్‌కు సంబంధించిన టెలీకాలర్స్‌ను నియమించుకుంటారు. ప్రధానంగా క్విక్కర్‌, ఓఎల్‌ఎక్స్‌తో పాటు ఫుడ్‌ డెలివరీ సైట్లను మోసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఎంచుకుంటున్నారు.

టోల్‌ఫ్రీ నంబర్లు, కస్టమర్‌ కేర్‌ సెంటర్లకు కాల్‌ చేసిన వారిని ఈజీగా ట్రాప్‌ చేసే విధంగా టెలీ కాలర్స్‌కు ట్రైనింగ్‌ ఇస్తున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు ఆయా కంపెనీల పేరుతో ఓటీపీ మెసేజ్‌ పంపిస్తున్నారు. మెసేజ్‌లో వచ్చిన నంబర్‌ చెప్పగానే ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ చేస్తున్నారు. బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను వెంటనే ఆశ్రయిస్తే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో సెక్యూరిటీ ఫీచర్స్‌ వాడటంతోపాటు టోల్‌ఫ్రీ నంబర్లు, ఫేక్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights