Srisailam: శ్రీశైలంలో ముగిసిన దసరా మహోత్సవాలు.. వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం

dasara-navaratri-at-srisailam

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ముగిసాయి. భ్రమరాంబికాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చింది. నందివాహనంపై అమ్మవారు ఆలయ ప్రదక్షిణ చేశారు. దసరా పండగ సందర్భంగా జమ్మి వృక్షానికి శమి పూజని నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో శ్రీస్వామి అమ్మవార్లకు వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య, ఈవో శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు 11 రోజుల పాటు కన్నుల పండువగా వైభవోపెతంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో 11వ రోజు అమ్మవారు నిజాలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు వేదపండితులు వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో వేదికపై పూజలు నిర్వహించారు.  అలానే నందివాహనంపై ఉన్న శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవారిని ఊరేగింపుగా శమి వృక్షం వద్దకు తీసుకొచ్చి జమ్మి వృక్షానికి అర్చకులు, ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కర్పూర హారతులిచ్చారు. పూజలు పూర్తవగానే భక్తులు భక్తి భావంతో పోటీ పడి శమీ ఆకులను తెంచుకుని విజయానందంతో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకొని వెళ్లారు. విజయదశమి రోజున శమీ ఆకులను పొందితే  విజయం పొందుతామని‌ భక్తుల ప్రగాఢ నమ్మకం. శమీ పూజల అనంతరం దసరా ముగింపులో భాగంగా ఆలయ పుష్కరిణిలో వైభవంగా శ్రీస్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించారు.

ప్రత్యేక తెప్పపై ఆదిదంపతులు విహారాన్ని చూస్తూ భక్తి  భావంతో పులకించిన భక్తులు, స్థానికులు ఆలయ పుష్కరిణి ప్రాంగణమంత భక్తుల శివనమస్మరణతో మారుమోగింది. పూజా కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ, ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దసరా పండగ తో శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights