అదిగో వాన.. ఇదిగో వాన అన్నారు.. కట్ చేస్తే, చుక్క కూడా కురవలేదు.. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ఫ్లాప్..

కోట్లు కుమ్మరించారు..! తడిసి ముద్దవ్వడం పక్కా అని తెగ నమ్మించారు..! అదిగో వాన.. ఇదిగో వాన అంటూ యమా ఊరించారు..! కానీ చుక్క వర్షం పడలేదు..! పడుతుందన్న ఆశా లేదు.! ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్లాప్ అయ్యింది. వాన పడుతుందన్న నగరవాసుల ఆశలకు గండికొట్టింది. అసలు క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి..? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారు..? పొల్యూషన్ కంట్రోల్‌కి ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి..?
ఢిల్లీలో కాలుష్య రక్కసిని తరిమికొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు. కృత్రిమ వర్షం కురిపించి కొంతలో కొంతైనా పొల్యూషన్‌ను తగ్గిద్దామని క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేఘాలను చల్లబరిచి వర్షింపజేసేందుకు విమానాలను రంగంలోకి దింపి రసాయనాలను చల్లించింది. ఐఐటీ–కాన్పూర్ సహకారంతో రాజధానిలో మేఘమథన క్రతువుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లక్షా, పది లక్షాలు కాదు… ఏకంగా 3 కోట్ల 21 లక్షల రూపాయలను ఈ క్లౌడ్ సీడింగ్‌కు ఖర్చు చేసింది.
ఈ క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ మంగళవారం జరిగింది. ఆ వెంటనే అదిగో వర్షం… ఇదిగో వర్షం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలువురు ప్రభుత్వ అధికారులు తడిసి ముద్దవ్వడం పక్కా అన్న సంకేతాలు కూడా ఇచ్చారు. టూ అవర్స్ టూ గో… వన్ అవర్ టూ గో అంటూ కౌంట్‌డౌన్ ప్రక్రియ కూడా సాగింది. కానీ… చుక్క అంటే చుక్క వర్షం కూడా ఢిల్లీపై పడకపోవడం ఆశ్చర్యపరిచింది. కోట్లు ఖర్చు చేసినా మేఘాల్లోంచి చుక్క రాలకపోవడం ఆందోళనకు కారణమైంది.
క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ అవ్వడంపై IIT కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ స్పందించారు. మేఘాల్లో తేమ లేకపోవడం వల్ల ప్రయత్నాలు విఫలం అయ్యాయని తెలిపారు. క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ కాలుష్యాన్ని తగ్గించేందుకు శాశ్వత పరిష్కారం కాకపోయినా.. కొంత ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఇప్పుడీ ప్రక్రియ సక్సెస్ కాకపోయినా ఆ తర్వాత దీని ఫలితం ఉంటుందని చెప్పుకొచ్చారు.
క్లౌడ్ సీడింగ్‌తో పని జరగదని మేం ముందే చెప్పామంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇలాంటి ప్రక్రియలతో ప్రయోజనం 15 శాతం మాత్రమే ఉంటుందంటున్నారు. కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇటు కాలుష్యంతో 42 శాతం మంది గొంతు నొప్పి, 17 శాతం మంది దగ్గు, దాదాపు 25 శాతం మంది కళ్ళ మంటతో బాధపడుతున్నారని పలు సర్వేలు చెబుతున్నారు. దీపావళి తర్వాత వాయు కాలుష్యం మరింత పెరిగిందని… గత ఐదేళ్ళల్లో ఇదే అత్యంత ఎక్కువ అంటున్నాయి. అలాగే ఈ ఎయిర్ పొల్యూషన్ నుంచి తప్పించుకునేందుకు 44 శాతం మంది ఇళ్ళ నుంచి బయటకు రావడమే మానేశారని పలు సర్వేలు తేల్చాయి.
మొత్తంగా క్లౌడ్ సీడింగ్ సరైన ఫలితాన్నివ్వకపోవడంతో కాలుష్య నివారణకు ప్రభుత్వం ఇంకెలాంటి చర్యలు చేపడుతుంది…? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది…? అన్నది చూడాలి…!
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
