ఉల్లి ధరలు తగ్గుతాయ్.. కేంద్రం కీలక నిర్ణయం.. ‘మహా’ ఎన్నికలతో మనకు ఊరట!

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ధరలను తగ్గించడం కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.
ఉల్లి ఘాటును తగ్గించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో.. ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అక్టోబర్ చివరి నాటికి 2 వేల టన్నుల ఉల్లి దిగుమతి కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి రూ.80 వరకు చేరింది.
దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇటీవలే ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. శ్రీలంక, మలేసియా, బంగ్లాదేశ్‌ల్లోనూ ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల న్యూఢిల్లీ వచ్చిన బంగ్లా ప్రధాని.. వంటల్లో ఉల్లి వాడొద్దని పనిమనుషులకు సూచించానని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉల్లి ధరల పెరుగుదలకు అక్రమ నిల్వలు కూడా కారణమని భావిస్తోన్న కేంద్రం.. హోల్ సేల్‌గా ఉల్లిని విక్రయించే వ్యాపారులు వంద క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ ఉంచొద్దని ఆదేశాలు జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో 1.1 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లిని దిగుమతి చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పెరిగిన ఉల్లి ధరలు ఎన్నికల్లో బీజేపీపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేలా చూడటం కోసం ప్రభుత్వం అన్ని విధాలా అప్రమత్తం అవుతోంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
