#ManVsWild, #ModionDiscovery
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రఖ్యాత ప్రజెంటర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి చేసిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్‌ను ప్రజలు విస్తృతంగా వీక్షించారు.
‘పర్యావరణ సంరక్షణ, వాతావరణంలో మార్పు వంటి అంశాల మీద ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కార్యక్రమం’ అని మోదీ ట్వీట్ చేశారు.
సోమవారం రాత్రి ప్రసారమైన ఈ కార్యక్రమం దేశంలో వైరల్ అయిందని చెప్పవచ్చు.
ఉత్తర ఉత్తరాఖండ్‌లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో మోదీ, బేర్ గ్రిల్స్ చెట్లు, పుట్టల మధ్య నడుస్తూ, కొండలు ఎక్కుతూ కనిపిస్తారు.
ఈ పర్యటనలో భాగంగా వారిద్దరూ చాలా అంశాల గురించి మాట్లాడుకున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితాలతో పాటు ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ గురించి బేర్స్ ఆయనను చాలా ప్రశ్నలు వేశారు.
ఈ కార్యక్రమంలో మోదీలోని మరో కోణం కనిపించింది. స్థిరంగా, నిక్కచ్చిగా కనిపించే మోదీ గురించే ఇప్పటి వరకు ప్రజలకు తెలుసు. కానీ, ఆయనలోని మరో పార్శ్వాన్ని ఈ కార్యక్రమం చూపించింది.
మీరెప్పుడైనా ఆందోళనకు గురయ్యారా అని అడిగినప్పుడు, “నా సమస్య ఏమిటంటే, నాకు ఎన్నడూ అలాంటి భయాలు అనుభవంలోకి రాలేదు” అని మోదీ బదులిచ్చారు.
“అది ఎలా ఉంటుందో, దానికి ఎలా స్పందిస్తానో అనే విషయాలను నేను చెప్పలేను. ఎందుకంటే, నేను ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతోనే చూస్తాను. ప్రతి దానిలోనూ సానుకూల అంశాలేమిటో గుర్తిస్తాను. బహుశా, అందుకేనేమో నేను ఎన్నడూ దేనికీ నిరాశకు గురైంది లేదు” అని మోదీ వివరించారు.
ఈ ప్రత్యేక ఎపిసోడ్ భారతదేశంలో భారీ స్థాయిలోనే చర్చకు తెరలేపింది. సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా వ్యాఖ్యానాలు కనిపించాయి.
కార్యక్రమం ప్రసారమైన తరువాత కూడా #ManVsWild, #ModionDiscovery అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
“నరేంద్ర మోదీకి భయమంటే ఏమిటో తెలియదు. ఈ లక్షణం కచ్చితంగా పాకిస్తాన్‌ను వణికిస్తుంది” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. కశ్మీర్ విభజన పరిణామాల నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు వెలుగు చూశాయి.
మరికొందరు మోదీ వ్యాఖ్యలపై మెమెలు షేర్ చేశారు.
ఈ కార్యక్రమం ప్రసారమైన తరువాత అమెరికా అధ్యక్షుడు ఒబామా, మోదీల మధ్య సోషల్ మీడియాలో పోటీ కనిపించింది. గతంలో ఒబామా కూడా బేర్ గ్రిల్స్‌తో మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో కనిపించారు. వీరిద్దరి ఎపిసోడ్లలో ఎవరికి ఎక్కువ పాపులారిటీ లభించిందనే చర్చ కూడా ట్విటర్లో కనిపించింది.
అంతేకాదు, చిన్నప్పుడు ఒక పిల్ల మొసలిని కొని తెచ్చుకున్నానని మోదీ తన జ్ఞాపకాలను షేర్ చేసుకోవడంపై ఫేస్‌బుక్‌లో పేరడీలు కూడా దర్శనమిచ్చాయి.
Source:bbc.com
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.